Suryapet: సైబర్ మోసాలపై టార్చ్‌లైట్లతో వినూత్న ప్రచారం..ఎస్పీ నరసింహ!

Suryapet: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ సూచించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 31 Oct 2026 8:01 AM IST
Suryapet
X

Suryapet: సైబర్ మోసాలపై టార్చ్‌లైట్లతో వినూత్న ప్రచారం..ఎస్పీ నరసింహ!

Suryapet: సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, "ఆగండి.. ఆలోచించండి.. ఆపై ముందడుగు వేయండి" అనే నినాదాన్ని పాటించాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు.

అక్టోబర్ నెలను సైబర్ మోసాల నివారణ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వినూత్న రీతిలో సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది వలయాకారంలో నిలబడి తమ చేతుల్లోని టార్చ్‌లైట్లను వెలిగిస్తూ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా పాల్గొని టార్చ్‌లైట్ వెలిగిస్తూ సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ లింకులు, పెట్టుబడుల పేరుతో అధిక లాభాల ఆశ, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు సేకరించడం వంటి పద్ధతుల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, వాట్సాప్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ముందు పూర్తిస్థాయిలో వివరాలు పరిశీలించాలని, ఎవరికీ ఓటీపీ, పిన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించకూడదని స్పష్టం చేశారు.

ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు.

సైబర్ నేరాల నివారణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు డిజిటల్ లావాదేవీల పట్ల అవగాహన కలిగి ఉండాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యార్థులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ, డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆత్మకూరు డీఎస్పీ నరసింహాచారి, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA