Suryapet: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్!

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ నిర్వహించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Nov 2026 12:31 PM IST
Suryapet
X

Suryapet: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్!

Suryapet: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో 400 మంది అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని చుక్కా రామయ్య పాఠశాలలో, కోదాడ పట్టణంలోని కెఆర్ఆర్ కళాశాలలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌కు సంబంధించి ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ నిర్వహించారు.

మొత్తం 497 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను హైదరాబాద్‌కు చెందిన ఐరైజ్ (iRise) ఇన్‌స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని చుక్కా రామయ్య పాఠశాలలో పరీక్ష నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో పరీక్షల పట్ల ఉన్న ఒత్తిడిని తగ్గించి, వాస్తవ పరీక్షలను సులభంగా, ఆత్మవిశ్వాసంతో రాసేలా చేయడమే ఈ మాక్ టెస్టుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌కు యువతను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగానే ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ పరీక్షలను సీరియస్‌గా తీసుకొని, సమయపాలన పాటిస్తూ ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఇలాంటి మాక్ టెస్టుల ద్వారా పరీక్షల సరళిపై అవగాహన పెరగడంతో పాటు, తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకునే అవకాశం లభిస్తుందని, పరీక్షల పట్ల భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్య సాధన దిశగా కష్టపడి చదవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, ఎస్ఐలు రాఘవేందర్ రెడ్డి, గోపికృష్ణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA