Suryapet: దళారులను నమ్మొద్దు.. ఎవరికీ రూపాయి ఇవ్వొద్దు: సర్వోత్తమ్!

Suryapet: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని దళారుల మాటలు నమ్మి ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేటలో స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 20 Nov 2026 7:07 AM IST
Suryapet
X

Suryapet: దళారులను నమ్మొద్దు.. ఎవరికీ రూపాయి ఇవ్వొద్దు: సర్వోత్తమ్!

సూర్యాపేట: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని దళారుల మాటలు నమ్మి ఎవరికీ రూపాయి ఇవ్వవద్దని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది స్పష్టం చేశారు.

నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం 10వ వార్డు కౌన్సిలర్ వెక్కంటి శేఖర్ రెడ్డితో కలిసి పిల్లలమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించిన ఘనత దివంగత నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డికి దక్కుతుందన్నారు.

నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం త్వరితగతిన ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు.

ప్రజా ప్రభుత్వం అందించే సహాయం కోసం ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవీ చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తనకు స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. 4 దశల్లో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత రూ.లక్ష, గోడలు నిర్మిస్తే రూ.లక్ష, స్లాబ్ నిర్మించిన తరువాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు కోడి నాగరాజు, చిలుముల సునీల్ రెడ్డి, చివ్వేంల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు యండి అంజద్ అలీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుణగంటి సతీష్ గౌడ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పడిదల రవి, చెంచల నిఖిల్, 10వ వార్డు కాంగ్రెస్ నాయకులు కోడిదల శ్రీనివాస్ రెడ్డి, చేరుకుపల్లి చంద్రశేఖర్, కనుకు వెంకన్న, చింత బిక్షం, చేరుకుపల్లి నర్సయ్య, టంగుటూరి శంభులింగం, బోడ రామస్వామి, చెరుకు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA