Suryapet: సూర్యాపేటలో మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆత్మీయ విందు
Suryapet: సూర్యాపేటలో దసరా సందర్భంగా మైనార్టీ సోదరులకు ఆత్మీయ విందు ఇచ్చిన జగదీష్ రెడ్డి. సర్వమతాల సారాంశం మానవత్వమేనని, సూర్యాపేట ఐక్యతకు నిదర్శనమని వెల్లడి.
Suryapet: సూర్యాపేటలో మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆత్మీయ విందు
సూర్యాపేట: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి ఏటా మాదిరిగానే మైనార్టీ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం, క్రైస్తవ సోదరులను ఆత్మీయంగా ఆహ్వానించి వారితో కలిసి విందు ఆరగించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో మంత్రిగా, ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి నాయకత్వంలో జరిగిన సూర్యాపేట అభివృద్ధి, ప్రశాంత వాతావరణం, పెరిగిన ఐక్యతను మత పెద్దలు కొనియాడి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... సర్వమతాల సారాంశం మానవత్వమేనని, మన సంస్కృతి, సంప్రదాయం యావత్ దేశానికే ఆదర్శమని అన్నారు.
ఉద్యమ సమయంలోనే ఐక్యతను చాటిన ఘనుడు కేసీఆర్ అని, అన్ని మతాల ప్రధాన పండుగలకు ఆనాడు కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఐక్యతతో వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. క్రిస్మస్ ప్రేమవిందు, రంజాన్ ఇఫ్తార్ విందు, తోఫా, దుస్తుల పంపిణీ అన్నీ మతాల పట్ల కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనాలేనని పేర్కొన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా చెక్కుచెదరని ఐక్యత సూర్యాపేట ప్రజలదని, భవిష్యత్తులోనూ ఇదే ఐక్యతతో మరింత ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం అంతిమ విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే దసరా అని, ప్రజలందరికీ మరోమారు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.




