Suryapet: హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన వసతులు: కలెక్టర్ తేజస్!
Suryapet: సూర్యాపేట జిల్లాలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు.
Suryapet: హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన వసతులు: కలెక్టర్ తేజస్!
సూర్యాపేట: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఇతర రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వసతి గృహాలు, గురుకులాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
హాజరుపై రోజువారీ పర్యవేక్షణ: వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని, హాజరు వివరాలను సంస్థల వారీగా సేకరించి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు కలెక్టరేట్లోని పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ (PMS) బృందానికి నివేదించాలని ఆదేశించారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక: జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో వసతి గృహాలు, గురుకులాల్లో తాగునీరు, వంట, పాత్రల శుభ్రత, స్నానం, మరుగుదొడ్లు తదితర అవసరాలకు సరిపడా నీటి లభ్యత ఉండేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యాసంస్థలో నీటి వనరులు, రోజువారీ అవసరాలు, నీటి నాణ్యత, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలను నమోదు చేయాలని, సంస్థల వారీగా నీటి అవసరాల వివరాలను మూడు రోజుల్లో సమర్పించాలని, సంబంధిత శాఖలు నవంబర్ 4లోగా సమగ్ర నివేదిక అందించాలని సూచించారు.
నాణ్యమైన ఆహారం, పారిశుద్ధ్యం: విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలని, వంటశాలల నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని తెలిపారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యుత్ సదుపాయాలు, నీటి పైపులైన్లను తనిఖీ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. ప్రతి వసతి గృహంలో రీడింగ్ రూమ్ లేదా రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ప్రతి విద్యార్థికి ఆరోగ్య ప్రొఫైల్: ప్రతి విద్యార్థికి ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్ నిర్వహించాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వైద్య పరీక్షలు, చికిత్సల వివరాలను నమోదు చేయాలని, ముఖ్యంగా కౌమార దశలోని బాలికల్లో రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి: విద్యార్థుల హాజరు, అధ్యయన సమయాలు, పరీక్షల ఫలితాలను విద్యార్థుల వారీగా నమోదు చేసి పర్యవేక్షించాలని, FA, SA, బేస్లైన్ పరీక్షల ఫలితాలను సమీకరించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన, పునశ్చరణ తరగతులు చేపట్టాలని ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
విద్యార్థులకు యూనిఫారాలు, 22 రకాల వస్తువులు/యంగ్ ఇండియా కిట్ల పంపిణీలో లోటుపాట్లు లేకుండా చూడాలని, డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, ట్యూటర్ల పారితోషికాలు తదితర పెండింగ్ బిల్లులపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. వసతి గృహాలు, గురుకులాల పనితీరుపై నవంబర్ 5న క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, డీఎస్సీడీవో లతా, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, అనుష, ఆర్సీఓలు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.




