Suryapet: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ!

Suryapet: సూర్యాపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. పట్టుదలతో చదివి లక్ష్యం చేరాలని సూచించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 2 Nov 2026 8:44 PM IST
Suryapet
X

Suryapet: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ!

సూర్యాపేట: ఉద్యోగాలు సాధించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు మానసికంగా సిద్ధం కావాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ అభ్యర్థులకు సూచించారు.

జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణలో భాగంగా సోమవారం పాత ఎస్పీ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు కలెక్టర్, ఎస్పీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక ప్రణాళికతో, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నాణ్యమైన ఉచిత శిక్షణ అందిస్తున్నామని, మొత్తం 400 మంది అభ్యర్థులకు (సూర్యాపేటలో 200, కోదాడలో 200) ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

ప్రతి సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచుకోవాలని, చదివే ప్రతి అంశాన్ని నోట్ బుక్ లో రాసుకోవాలని, గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి ప్రతి సబ్జెక్టును కనీసం మూడుసార్లు రివిజన్ చేయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ కోసం నిర్వహించిన ఎంపిక పరీక్షకు సుమారు 1,400 మంది హాజరుకాగా ప్రతిభ ఆధారంగా 400 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన, పోలీసు సిబ్బందితో ఫిజికల్ శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్ముడ్ డీఎస్పీ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, అధ్యాపక బృందం, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA