Suryapet: వందల ఎకరాల్లో ఎండిన పంటలు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Suryapet: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో ఎండిన పంట పొలాలను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 21 Sept 2026 3:18 PM IST
Suryapet
X

Suryapet: వందల ఎకరాల్లో ఎండిన పంటలు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహాన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరిశీలించారు. పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీదెళ్ల సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ ను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దేనని అన్నారు. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలం పరిస్థితి చూసి రైతులు సగం పొలాలే నాటు పెట్టుకున్నారని, అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు ఉందని ప్రభుత్వ పాలన తీరును ఎద్దేవా చేశారు. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా పంటలు ఎండబెడుతున్నారని, ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి ఉందని మండిపడ్డారు. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నారని ఆరోపించారు.

మీడియా సంస్థలు విలేకరులను గ్రామాల్లో తిప్పి వాస్తవాలు తెలుసుకోవాలని, ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపాలని కోరారు. రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదని అన్నారు.

ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టిందని, ఆ దయ్యాలు, భూతాలను ఎలా వదిలించాలో రైతులకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నామని, మరోమారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని, కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నానని, ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయమని హెచ్చరించారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, తన మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతాయా, డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిదని, లేనిపక్షంలో ప్రభుత్వం పైన రైతుల పక్షాన BRS పోరాటం తప్పదని స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA