Suryapet: ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు, అలారాలు తప్పనిసరి: డీఎస్పీ!
Suryapet: సూర్యాపేటలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆదేశించారు.
Suryapet: ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు, అలారాలు తప్పనిసరి: డీఎస్పీ!
సూర్యాపేట: బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణంలోని వివిధ బ్యాంకుల అధికారులతో భద్రతా అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల కష్టార్జిత సొమ్ము భద్రపరిచే బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రత కల్పించడం ముఖ్యమని అన్నారు.
ఆధునిక పరికరాలతో చిన్న సూట్ కేసుల్లో కిట్లను తీసుకొచ్చి సాధారణ వ్యక్తులుగా ఏటీఎంలలోకి ప్రవేశించి తక్కువ సమయంలో నగదు అపహరిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బ్యాంకులు, ఏటీఎంలలో నాణ్యమైన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, అనుమానాస్పద కదలికలు గుర్తించినప్పుడు అప్రమత్తం చేసేలా అలారం వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. అపరిచితులు, ఆయుధాలతో వచ్చే వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందేలా సమాచార వ్యవస్థ ఉండాలని అన్నారు.
రాత్రి గస్తీలో భాగంగా అన్ని ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, బ్యాంకు అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగదు రవాణా సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని తెలిపారు.
సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని, తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. బ్యాంకుల్లో అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని, మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు కనకరత్నం, రహిముద్దీన్, వివిధ బ్యాంకుల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




