Suryapet: ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి: వి.కోటేశ్వరరావు!

Suryapet: సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Oct 2026 5:50 PM IST
Suryapet
X

Suryapet: ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి: వి.కోటేశ్వరరావు!

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేపట్టాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం AIKMS రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్-నినో ముప్పుపై కొంతకాలంగా వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారిక నివేదికలే తెలియజేస్తున్నాయని, ఇది వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజల జీవనానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, భూగర్భ జలాలు అడుగంటకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామన్న ప్రభుత్వం అధికారికంగా 9 గంటలు కూడా ఇవ్వడం లేదని, పది నిమిషాలకోసారి కరెంటు పోవడం వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి కనీసం 16 గంటలైనా కోతలు లేకుండా కరెంటు సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల హామీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12,000, మహిళలకు రూ.2,500, వృద్ధాప్య పెన్షన్ రూ.4,000 ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పనులు నిరంతరాయంగా కొనసాగించి ప్రతి మనిషికి 200 రోజుల పని కల్పించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రూ.800 ఇవ్వాలని కోరారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, బియ్యం ధరలతో సహా అన్ని రకాల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అధికారులు గ్రామీణ స్థాయిలో స్వయంగా వెళ్లి పరిశీలించి పంట నష్టం అంచనాలపై సమగ్ర సర్వే జరపాలని కోరారు. జిల్లాలో 1,16,000 వ్యవసాయ మోటార్లు ఉన్నాయని, వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు తగ్గడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ స్థితిలో చెరువులు, కుంటలను సాగర్, గోదావరి జలాలతో నింపాలని అన్నారు.

రబీ పంటల సాగుపై వ్యవసాయ శాఖ గ్రామస్థాయిలో సమావేశాలు, సదస్సుల ద్వారా రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించి, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల గురించి వివరించాలని, ఈ సీజన్‌లో పురుగు మందులు, ఎరువులు సబ్సిడీపై, విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు.

పశు సంపద రక్షణకు చర్యలు చేపట్టి పశుగ్రాసం సరఫరా చేయాలని, పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50,000, పంటలు వేయలేకపోయిన రైతులకు ఎకరానికి రూ.20,000 నష్టపరిహారం అందించాలని, పాత వ్యవసాయ రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కరువు సహాయ చర్యల కోసం రూ.50 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, సీతారాం ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగు, తాగునీరు అందించేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. ధర్నా అనంతరం డీఆర్ఓ ప్రేమ్ రాజ్‌కు సమస్యలతో కూడిన మెమోరాండం అందజేశారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, మేకల కనకరావు, నాగయ్య, పన్నాల సంజీవ్ రెడ్డి, భయం లింగయ్య, సుంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మైబెల్లి, పోరండ్ల దశరథ, జిలేరు, కోట మధుసూదన్ రెడ్డి, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఉదయగిరి, పోలేబోయిన కిరణ్, దేసోజు మధు, వి. నర్సింహారావు, నల్గొండ నాగయ్య, డి. రవి, పుల్లూరి సింహాద్రి, బొల్లె వెంకన్న, నర్సిరెడ్డి, గండు నగేష్, వీర్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA