Suryapet: సూర్యాపేట జిల్లాలో డీజే సౌండ్ సిస్టంలపై పూర్తి నిషేధం!
Suryapet: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా డీజే సౌండ్ సిస్టంలపై పూర్తి నిషేధం: ఎస్పీ నరసింహ ఐపీఎస్. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.
Suryapet: సూర్యాపేట జిల్లాలో డీజే సౌండ్ సిస్టంలపై పూర్తి నిషేధం!
Suryapet: జిల్లా వ్యాప్తంగా డీజే సౌండ్ సిస్టంలపై పూర్తిగా నిషేధం విధించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పండగైనా, ఉత్సవమైనా, పెళ్లయినా, పుట్టినరోజైనా డీజే శబ్దాలు లేకపోతే హుషారు లేదనుకునే పరిస్థితి నెలకొందని, అయితే ఇలాంటి అధిక శబ్దాలతో ప్రాణాలకు ముప్పు ఉందన్నారు.
పరిమితికి మించిన డెసిబెల్ శబ్దాలకు ఎక్కువసేపు గురికావడం వల్ల వినికిడి లోపం, తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు అధిక శబ్దం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అధిక శబ్దాలపై నిషేధిత నిబంధనలు అమల్లో ఉన్నాయని, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు డీజే సౌండ్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
సంతోషాన్ని పంచుకోవడం తప్పు కాదు.. కానీ మన సంతోషం మరొకరికి బాధ కలిగించకూడదు. పరిమిత శబ్దంతో ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకుందాం అని ఎస్పీ నరసింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




