Suryapet: రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సూర్యాపేట పోలీసుల ప్రతిభ!

Suryapet: తెలంగాణ పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సూర్యాపేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ. విజేతలను అభినందించిన ఎస్పీ నరసింహ. ఆల్ ఇండియా గేమ్స్‌కు ఆరుగురు క్రీడాకారులు ఎంపిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 8:12 AM IST
Suryapet
X

Suryapet:రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సూర్యాపేట పోలీసుల ప్రతిభ!

Suryapet: వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు గత వారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐదవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో సూర్యాపేట జిల్లా పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపారు.

పోలీస్ జోన్-5 తరఫున వివిధ క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన జిల్లా పోలీస్ క్రీడాకారులు మహిళా వాలీబాల్‌లో ప్రథమ బహుమతి, మహిళా కబడ్డీలో ద్వితీయ బహుమతి సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారిని క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో జోన్-5 తరపున జట్టులో సూర్యాపేట జిల్లా పోలీసు క్రీడాకారులు ప్రతిభ చూపారని అభినందించారు. జోన్-5 మహిళా కబడ్డీ జట్టులో జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు సీహెచ్. లత, ఎన్. దీపిక, ఎం. అనూష, ఎస్.కె. అనీఫా, ఈ. అరుంధతి, సీహెచ్. శిరీష. వాలీబాల్ జట్టులో జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు కే. లావణ్య, బి. ప్రియాంక, కే. దివ్యభారతి, కే. ప్రవల్లిక ప్రాతినిధ్యం వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. వీరి క్రీడా నైపుణ్యం, సమన్వయం, పట్టుదలతో జోన్-5 జట్టు పోటీల్లో బహుమతి సాధించిందన్నారు.

ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌కు జిల్లా క్రీడాకారుల ఎంపిక

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సూర్యాపేట జిల్లా పోలీస్ క్రీడాకారులు ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌కు ఎంపిక కావడం మరో విశేషం. మహిళా కబడ్డీ విభాగంలో సీహెచ్. లత, ఎన్. దీపిక, ఎం. అనూష, ఎస్.కె. అనీఫా తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. ఈ పోటీలు వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్నాయి. అదేవిధంగా మహిళా వాలీబాల్ విభాగంలో కే. లావణ్య, బి. ప్రియాంక తెలంగాణ పోలీస్ జట్టు తరఫున జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించనున్నారు.

మహిళా కోకో విభాగంలో కే. దివ్యభారతి తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున ఆల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించడం, జాతీయస్థాయి పోలీస్ క్రీడలకు ఎంపిక కావడం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌లో కూడా ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి, సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే పోలీస్ సిబ్బందికి శాఖాపరంగా తగిన ప్రోత్సాహకాలు, అవకాశాలు లభిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు క్రీడలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచుతున్న క్రీడాకారులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అడ్మిన్ ప్రవీణ్ కుమార్, ఆర్‌ఐ జానయ్య, కబడ్డీ టీం కోచ్ ఎస్‌ఐ రామచందర్ గౌడ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, వాలీబాల్ టీం కోచ్ కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్