Suryapet: కాకరకాయలు తింటూ దివ్యాంగుల వినూత్న నిరసన

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పచ్చి కాకరకాయలు తింటూ దివ్యాంగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Nov 2026 4:58 PM IST
Suryapet
X

Suryapet: కాకరకాయలు తింటూ దివ్యాంగుల వినూత్న నిరసన

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (BVHPS) సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి దిగిన దివ్యాంగులు, పచ్చి కాకరకాయలు తింటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు మండిపడ్డారు.

దాదాపు మూడేళ్ల పాలన పూర్తయినా తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్ల పాలన వికలాంగుల సమాజానికి కాకరకాయ కంటే చేదుగా మారిందని విమర్శిస్తూ, కాకరకాయలు తిని తమ నిరసన తెలిపారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తక్షణమే వికలాంగుల పెన్షన్‌ను 6 వేల రూపాయలకు పెంచాలని, ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రతి జిల్లాలో 5 వేలకు తగ్గకుండా వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు.

మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను తక్షణమే ప్రత్యేక శాఖగా గుర్తించాలని, రాష్ట్రంలో వికలాంగులపై పెరుగుతున్న దాడుల దృష్ట్యా అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా వికలాంగుల సంఘం నాయకుడు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలను దాదాపు మూడేళ్ల పరిపాలన పూర్తయినా గాని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని తీరును నిరసిస్తూ, ఈ మూడేళ్లలో వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ కాకరకాయ కంటే కూడా చేదు పరిపాలన అందించిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3 లోపు తమ సమస్యలను పరిష్కరించకపోతే, లక్షలాది మంది వికలాంగులతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA