Suryapet: తుపాను ఎఫెక్ట్: సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్!
Suryapet: తుపాను ప్రభావంతో సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్ జారీ అయ్యింది. గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Suryapet: తుపాను ఎఫెక్ట్: సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్!
సూర్యాపేట: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాను ప్రభావం సూర్యాపేట జిల్లాపై ఉండే అవకాశం ఉందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ అత్యవసర వెబెక్స్ సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు
తుపాను ప్రభావంతో జిల్లాలో గాలుల వేగం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, అర్ధరాత్రి 55 నుంచి 65 కిలోమీటర్లు, మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సమావేశంలో వివరించారు. తుపాను తీరం దాటే ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉన్నందున ముఖ్యంగా దక్షిణ, నైరుతి ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
సాయంత్రం 4 నుంచి ప్రయాణాలు వద్దు
తుపాను ప్రభావం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయొద్దని కలెక్టర్ సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాల రాకపోకలను వీలైనంత వరకు నిలిపివేయాలన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, ప్రమాదకర నిర్మాణాల దగ్గర ఉండొద్దని హెచ్చరించారు. ఇళ్లలోని కిటికీలు, తలుపులు, రూఫ్ షీట్లు, బయట ఉన్న వదులుగా ఉండే వస్తువులను భద్రపరుచుకోవాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు గ్రామాలు, బలహీనమైన భవనాలను గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గుడిసెలు, తాత్కాలిక షెడ్లలో నివసించే వారిని పక్కా భవనాలకు తరలించాలన్నారు. ప్రతి గ్రామంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని సురక్షిత ఆశ్రయ కేంద్రంగా గుర్తించాలని సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వాగులు, వంకలు, బ్రిడ్జిలు, కాజ్‌వేలపై వరద ప్రవాహం ఉంటే రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు.
స్కూళ్లకు ముందస్తు ఆదేశాలు
విద్యార్థుల భద్రత దృష్ట్యా మధ్యాహ్న భోజనం తర్వాత స్కూళ్లకు సెలవు ప్రకటించి పిల్లలను ఇళ్లకు పంపించాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు టీచర్లు కూడా ఇంటికి వెళ్లాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు చెప్పారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు ఆహారం, తాగునీరు, రక్షణ కల్పించాలని ఆదేశించారు.
24 గంటలు అందుబాటులో అధికారులు
రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, కట్టలు, కాల్వల నీటిమట్టాలను ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల న్నారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రోడ్లపై చెట్లు కూలినా, వరదలతో రాకపోకలకు అంతరాయం కలిగినా వెంటనే స్పందించేందుకు జేసీబీలు, ఇసుక బస్తాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
గంటగంటకు పరిస్థితిపై నివేదిక
జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి కీలక శాఖ నుంచి ఒక అధికారిని కంట్రోల్ రూమ్‌లో 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని సూచించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి గంటకు పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఫోన్ నెట్వర్క్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడితే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని జిల్లా కేంద్రానికి చేరవేయాలని సూచించారు. తుపాను వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కార్యక్రమం లో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, వెంకటరమణ, డీఈఓ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ డిడి శ్రీనివాసరావు, డిఎస్ఓ మోహన్ బాబు, ఆర్టీవో పురుషోత్తం రెడ్డి, డిఐఈఓ సులోచన రాణి, ఆడిట్ ఆఫీసర్ శ్యామ్, డిటిడిఓ ఇరిగేషన్ ఫైర్ ఇతర సంబంధిత శాఖలు తదితరులు పాల్గొన్నారు.




