Suryapet: ప్రభుత్వ ధరలకే బియ్యం విక్రయించాలి: కలెక్టర్ తేజస్!
Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ధరల ప్రకారమే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని మిల్లర్లు, డీలర్లను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.
Suryapet: ప్రభుత్వ ధరలకే బియ్యం విక్రయించాలి: కలెక్టర్ తేజస్!
సూర్యాపేట: జిల్లాలో బియ్యం విక్రయాలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే జరగాలని, ధరలకు మించి విక్రయించే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా హోల్ సేల్ రైస్ డీలర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బియ్యం ధరలను నియంత్రిస్తూ వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా రైస్ మిల్లర్లు, హోల్ సేల్ డీలర్లు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ ధరల పట్టికను అన్ని బియ్యం విక్రయ కేంద్రాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ధరల విషయంలో పారదర్శకత పాటిస్తూ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే బియ్యం విక్రయిస్తామని, ధరల పట్టికను దుకాణాల్లో తప్పనిసరిగా ప్రదర్శిస్తామని సమావేశంలో పాల్గొన్న రైస్ మిల్లర్లు, డీలర్లు కలెక్టర్ కు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్, డీఎస్ఓ మోహన్ బాబు, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్ శ్రీధర్ రెడ్డి, సిబ్బంది, జిల్లాలోని రైస్ మిల్లర్లు, హోల్ సేల్ డీలర్లు పాల్గొన్నారు.




