Suryapet: ఆరోగ్యశాఖపై కలెక్టర్ సమీక్ష.. పీహెచ్‌సీలపై డైలీ మానిటరింగ్!

Suryapet: సూర్యాపేట జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష నిర్వహించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Nov 2026 10:52 AM IST
Suryapet
X

Suryapet: ఆరోగ్యశాఖపై కలెక్టర్ సమీక్ష.. పీహెచ్‌సీలపై డైలీ మానిటరింగ్!

Suryapet: ఆరోగ్యశాఖలో పనితీరు మెరుగుపర్చేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. ఇకపై వ్యక్తులపై ఆధారపడకుండా వ్యవస్థాగత మార్పులతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శాఖలో ప్రతి అధికారి తన బాధ్యతలను గుర్తించి, ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రతిరోజూ పీహెచ్‌సిలతో పది నిమిషాల పాటు సమీక్ష నిర్వహిస్తానని ప్రకటించారు.

ప్రతి అధికారి తన పరిధిలోని కార్యక్రమాలు, బాధ్యతలు, పర్యవేక్షించాల్సిన అంశాలను జాబితా చేసుకోవాలని సూచించారు. వాటిలో అత్యంత కీలకమైన ఐదు అంశాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలన్నారు. మొత్తం పనుల్లో 80 శాతం పురోగతి సాధించేందుకు ఈ ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పెండింగ్ పనులు, అత్యవసర అంశాలు, పూర్తి చేసిన కార్యక్రమాల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

నవంబర్ 30 వరకు ప్రతిరోజూ పీహెచ్‌సిల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి అధికారి తన పనుల పురోగతిని ఒక పేజీలో రాసుకొని సమావేశానికి రావాలని ఆదేశించారు. ఏ పని పూర్తయింది? ఏది పెండింగ్‌లో ఉంది? ఎంత శాతం పురోగతి సాధించారు? అనే వివరాలు స్పష్టంగా తెలియజేయాలన్నారు. సమీక్షకు హాజరుకాకపోవడాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు.

ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఫైళ్ల సర్క్యులేషన్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఫైళ్లు నిబంధనల ప్రకారం సక్రమంగా రావాలని, ఆఫీస్ ప్రొసీజర్స్, క్యాడర్ మేనేజ్‌మెంట్‌లో లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. పాత కారణాలు చెబుతూ పనులు ఆలస్యం చేయడాన్ని ఇకపై అంగీకరించబోమన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇమ్యూనైజేషన్, లేబర్ రూముల ఆధునీకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మళ్లించేలా సేవల్లో గణనీయమైన మార్పు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెక్టర్ బార్న్ వ్యాధుల నియంత్రణ వంటి అంశాల్లో ఆరోగ్యశాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్య ఏ స్థాయిలో ఉంటే అదే స్థాయిలో పరిష్కరించుకోవాలని, ప్రతి చిన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ లేదా డీఎంహెచ్‌వో స్థాయికి తీసుకురావడం సరైన విధానం కాదన్నారు. ఆఫీసులో ఉన్నంతసేపు ఇతర విషయాలు పక్కనపెట్టి విధులపైనే దృష్టి పెట్టాలని హెచ్చరించారు.

సానుకూల దృక్పథంతో పనిచేస్తూ ఆరోగ్యశాఖలో మార్పుకు అధికారులు ముందుండాలన్నారు. పనితీరు మెరుగుపర్చుకోని వారిని మారుమూల ప్రాంతాలకు, అవసరమైతే శాఖ వెలుపలికి పంపించే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. పాత విషయాలను తవ్వకుండా, నేటి నుంచి పద్ధతి ప్రకారం పనిచేయాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌ఓ కోటిరత్నం, డిప్యూటీ డిఎంహెచ్‌వో చంద్రశేఖర్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA