Suryapet: రోడ్డు వేయాలంటూ కలెక్టర్, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి!

Suryapet: సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామానికి సరైన రోడ్డు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సోషల్ మీడియాలో విజ్ఞప్తి. కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించాలని వేడుకోలు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 17 Oct 2026 5:07 PM IST
Suryapet
X

Suryapet: రోడ్డు వేయాలంటూ కలెక్టర్, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి!

సూర్యాపేట: మాకు NH-44 లాంటి పెద్ద రోడ్డు వద్దు, గుంతలు లేని ఒక మంచి రోడ్డు చాలు సార్... అంటూ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామస్తులు సోషల్ మీడియా వేదికగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీడీవో, ఎమ్మార్వోలకు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు.

తాము డబ్బులు, ఉద్యోగాలు అడగడం లేదని, తమ గ్రామాన్ని మెయిన్ రోడ్డుతో కలిపే సరైన సీసీ రోడ్డు లేదా తారు రోడ్డు కావాలని వేడుకుంటున్నారు.

గ్రామస్తుల ఆవేదన ఇలా...

1. రైతు పంట కుళ్లిపోతోంది: చిల్పకుంట్ల రైతులు పండించిన వడ్లు, మిర్చి, పత్తిని మార్కెట్ కు తీసుకెళ్లాలంటే లారీలు రావడం లేదు. వర్షం వస్తే రోడ్డు మొత్తం బురదమయమై పంట అక్కడే కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

2. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం: పిల్లలు నూతనకల్, సూర్యాపేటకు స్కూల్, కాలేజీకి వెళ్లాలంటే రోడ్డు గుంతలతో నిండి ఉందని, బైక్ లు పడిపోతున్నాయని, ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నారని తెలిపారు.

3. ప్రాణాలు గాలిలో: రాత్రి వేళ ఎవరికైనా అనారోగ్యం వస్తే 108 అంబులెన్స్ చిల్పకుంట్ల వరకు రావడం లేదని, 2 కి.మీ దూరంలోనే ఆపేసి వెళ్లిపోతోందని, గర్భిణీ స్త్రీలను డోలీ కట్టి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఇది 2026 తెలంగాణలో జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

4. వలసలు: రోడ్డు లేక బ్యాంకులు రావడం లేదని, వ్యాపారాలు రావడం లేదని, యువకులు వలస వెళ్తున్నారని పేర్కొన్నారు.

కలెక్టర్ గారు బైక్ మీద రండి: గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఒక్కసారి అధికారిక కారులో కాకుండా సాధారణ బైక్ మీద తమ గ్రామానికి వస్తే తమ బాధ అర్థమవుతుందని గ్రామస్తులు కోరుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, కరెంట్ ఇచ్చారని, కానీ ఆ ఇంటికి వెళ్లడానికి రోడ్డు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

వెంటనే చిల్పకుంట్ల గ్రామ రోడ్డుకు సర్వే చేసి నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA