Suryapet: కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన.. రూ.18 వేల వేతనం డిమాండ్

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Nov 2026 4:53 PM IST
Suryapet
X

Suryapet: కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన.. రూ.18 వేల వేతనం డిమాండ్

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 18 వేల రూపాయల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

గత ప్రభుత్వ హయాంలో రూ. 9,700 వేతనం ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే రూ. 18 వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆశా వర్కర్లు గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటివరకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆశా వర్కర్ నాయకురాలు మాట్లాడుతూ గతంలో 160 రోజులు సమ్మె చేసినప్పుడు రూ. 1,500 నుంచి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రూ. 9,700 ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలవగానే మొదటి సంతకంతో 18 వేల జీతం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని అన్నారని, ఇంతవరకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదని అన్నారు. గ్రామాలు ఆరోగ్యంగా, సస్యశ్యామలంగా ఉండాలంటే ఆశాలే కీలకమని, దయచేసి ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం వెంటనే తమను చర్చలకు పిలిచి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA