Suryapet: సోలార్ ప్లాంట్ కోసం అనుమతి లేకుండా 46 చెట్ల నరికివేత!

Suryapet: సూర్యాపేట జిల్లా కోటపాడులో సోలార్ ప్లాంట్ కోసం 46 చెట్లను అక్రమంగా నరికేసిన ఘటనపై వివాదం. పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు, కేసుకు సిద్ధమైన ఫారెస్ట్ అధికారులు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 17 Oct 2026 5:00 PM IST
Suryapet
X

Suryapet: సోలార్ ప్లాంట్ కోసం అనుమతి లేకుండా 46 చెట్ల నరికివేత!

సూర్యాపేట: పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉండి పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా 46 చెట్లను నరికేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం కోటపాడు శివారులో కలకలం రేపింది.

కోటపాడు శివారులో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 41 విలువైన టేకు చెట్లు, 5 వేప చెట్లను నేలమట్టం చేశారు.

ఈ అక్రమ నరికివేత వెనుక కోటపాడ్ గ్రామ సర్పంచ్ కుమారుడు, గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న కందాల రామకృష్ణారెడ్డి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పచ్చదనాన్ని పెంచాల్సిన ప్రభుత్వ ఉద్యోగే ఇలా అక్రమంగా చెట్లు కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అటవీ అధికారులపై దురుసు ప్రవర్తన:

సమాచారం అందుకుని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అగౌరవంగా మాట్లాడినట్లు తెలిసింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరించే ధోరణిలో ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది.

కఠిన చర్యలు తప్పవు: ఫారెస్ట్ అధికారులు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా చెట్లను నరకడం చట్టవిరుద్ధమని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తామని, పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA