Suryapet: సూర్యాపేటలో రూ.25 లక్షల విలువైన 112 కిలోల గంజాయి పట్టివేత

Suryapet: ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 112 కిలోల గంజాయిని సూర్యాపేట పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 13 Nov 2026 5:16 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో రూ.25 లక్షల విలువైన 112 కిలోల గంజాయి పట్టివేత

సూర్యాపేట: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. 112 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ తెలిపారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన ఐదుగురు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు పథకం రూపొందించారు. ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథపురి ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో రూ.2,000 చొప్పున మొత్తం 112 కిలోల గంజాయిని రూ.2.24 లక్షలకు కొనుగోలు చేశారు.

అనంతరం గంజాయిని 41 ప్యాకెట్లుగా తయారుచేసి ఇన్నోవా కారులో లోడ్ చేసి మహారాష్ట్రకు తరలించేందుకు బయలుదేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మరో ఎర్టిగా కారును ఎస్కార్ట్‌గా ముందు నడుపుతూ, పోలీసుల కదలికలను గమనిస్తూ వెనుక వస్తున్న ఇన్నోవా వాహనానికి సమాచారం అందించేవారు.

ఈ క్రమంలో నవంబర్ 7వ తేదీన సూర్యాపేట పట్టణ శివారులోని ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిపై పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో ఇన్నోవా కారు బ్రేక్‌డౌన్ అయింది. దీంతో నిందితులు వాహనాన్ని రహదారి పక్కన వదిలి పరారయ్యారు. అనుమానాస్పదంగా కారు నిలిపి ఉన్నట్లు సమాచారం అందడంతో సూర్యాపేట II టౌన్ ఎస్సైలు కె. గోపికృష్ణ, బి. రామచంద్రం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని తనిఖీ చేయగా, 41 ప్యాకెట్లలో 112 కిలోల గంజాయి గుర్తించారు. వెంటనే పంచుల సమక్షంలో గంజాయితో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా వాహనాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు నవంబర్ 12వ తేదీన సూర్యాపేటకు వచ్చిన ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు గంజాయి అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు వెల్లడైంది.

అరెస్టయిన నిందితులు:

1. ఆకాష్ విజయ్ దాబేకర్ (23), బీడ్ జిల్లా, మహారాష్ట్ర.

2. ఆకాష్ దిలీప్ మోరే (32), బుల్దానా జిల్లా, మహారాష్ట్ర.

వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ వెంకటయ్య, ఎస్ఐలు గోపికృష్ణ, రామచందర్ పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సూర్యాపేట II టౌన్ ఎస్సైలు కె. గోపికృష్ణ, రామచందర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు, కానిస్టేబుళ్లు కొండా రమేష్, ఎన్. నవీన్‌లను ఎస్పీ అభినందించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA