Suryapet: పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు.. వృథా అవుతున్న ప్రజాధనం!

Suryapet: ముఖ్యమంత్రి విద్యుత్ పొదుపు ఆదేశాలను గాలికొదిలేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Oct 2026 1:21 PM IST
Suryapet
X

Suryapet: పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు.. వృథా అవుతున్న ప్రజాధనం!

Suryapet: ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైతే తప్ప ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు వేయవద్దని, విద్యుత్‌ను పొదుపు చేయాలని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం మున్సిపల్ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. విద్యుత్ పొదుపు మాట అటుంచి, పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నా కనికరించే నాథుడే కరువయ్యాడు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భాషా నాయక్ తండా, మూసీ కెనాల్ పక్క వీధులలోని వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు) పగటి పూట కూడా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. సూర్యుడు నడినెత్తికి వచ్చినా దీపాలు ఆర్పే తీరిక అధికారులకు, సిబ్బందికి లేకపోవడంతో వేల యూనిట్ల విద్యుత్ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ప్రజాధనం ఇలా వృథా అవుతున్నా వార్డు పర్యవేక్షకులు గానీ, మున్సిపల్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.

ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత వార్డు సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పగటివేళల్లో వీధి దీపాలు వెలగకుండా ఆటోమేటిక్ సెన్సార్లు ఏర్పాటు చేయడం లేదా సిబ్బందిని బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA