Suryapet: పోలీస్ శాఖలో ప్రక్షాళన.. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు!
Suryapet: సూర్యాపేట పోలీస్ శాఖలో ప్రక్షాళన షురూ అయింది. వసూళ్లకు పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లు, స్టేషన్ నుంచి బైక్ మాయం కేసులో హుజూర్‌నగర్ ఎస్ఐ నరేష్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు.
Suryapet: పోలీస్ శాఖలో ప్రక్షాళన.. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు!
Suryapet: జిల్లా పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. ఖాకీ ముసుగులో అక్రమాలకు, నిర్లక్ష్యానికి పాల్పడుతున్న సిబ్బందిపై జిల్లా ఎస్పీ నరసింహ కొరడా ఝుళిపిస్తున్నారు. విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు, రికవరీ వాహనం మాయమైన కేసులో ఒక ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
స్క్రాప్ లారీ వద్ద వసూళ్ల దందా.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న శ్రీను, కిరణ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు రాత్రివేళ వాహన తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఓ స్క్రాప్ లారీని ఆపిన వీరు, వాహనానికి సంబంధించిన కాగితాలు సరిగ్గా లేవంటూ బెదిరించి రూ. 21 వేలు ఫోన్‌పే (PhonePe) ద్వారా వసూలు చేశారు.
ఈ వ్యవహారంపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మామూళ్ల వసూళ్ల వ్యవహారం నిర్ధారణ కావడంతో, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను తక్షణమే సస్పెండ్ చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు.
స్టేషన్ నుంచే బుల్లెట్ బైక్ మాయం.. ఎస్ఐపై వేటు
మరో ఘటనలో హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన ఓ బుల్లెట్ బైక్‌ను ఇటీవల వనస్థలిపురం పోలీసులు హుజూర్‌నగర్‌లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆ బైక్‌ను భద్రపరచడానికి హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచి వెళ్లారు. అయితే, దొంగ నుంచి ఆ రికవరీ బైక్‌ను కొనుగోలు చేసిన ఓ స్థానిక నాయకుడు, ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే బైక్‌ను తీసుకెళ్లిపోయాడు.
తిరిగి బైక్‌ను తీసుకెళ్లేందుకు వనస్థలిపురం పోలీసులు హుజూర్‌నగర్ స్టేషన్‌కు రాగా, బైక్ మాయమైన విషయం బయటపడింది. దీంతో షాక్‌కు గురైన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఎస్పీ నరసింహ, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ నరేష్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
శాఖలో అక్రమాలకు పాల్పడినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ నరసింహ స్పష్టం చేయడంతో జిల్లా పోలీస్ వర్గాల్లో కలకలం రేగింది.




