Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశ దాటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో కీలక ముందడుగు ప్రమాదకర షియర్ జోన్ దాటిన తవ్వకాలు. 2028 జూన్ నాటికి నీటి సరఫరా లక్ష్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశ దాటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
Uttam Kumar Reddy: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల మండలాన్ని (షియర్ జోన్) జాగ్రత్తగా దాటడంతో పనుల వేగం పెంచేందుకు మార్గం సుగమమైందన్నారు.
అదనపు యంత్రాలను రంగంలోకి దించి, తవ్విన రాళ్లు, మట్టిని బయటకు తరలించే వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగంతోపాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, అదనపు యంత్రాల వినియోగంపై చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించి, ఏళ్ల తరబడి వేధిస్తున్న నీటి కొరతను తీర్చాలన్నదే లక్ష్యమని తెలిపారు.2028 జూన్ నాటికి నీటిని అందించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఐదారు నెలల్లో 700 మీటర్లు
గడిచిన ఐదారు నెలల్లో సొరంగం తవ్వకాలు సుమారు 700 మీటర్లు ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం మంత్రికి వివరించింది. అవుట్‌లెట్ వైపు సుమారు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల మేర పురోగతి నమోదైందని తెలిపింది. తీవ్రమైన భూగర్భ, సాంకేతిక సమస్యలతోపాటు యంత్రాలు, తవ్విన పదార్థాల రవాణాలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ ఈ పురోగతి సాధించినట్లు పేర్కొంది. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యాయని, మరో 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించింది.
అత్యంత ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటడం ప్రాజెక్టులో ముఖ్యమైన ముందడుగని ఉత్తమ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన అధికారులు, కార్మికుల కృషిని అభినందించారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ సొరంగంలో 20 కిలోమీటర్లకు పైగా లోపల పనిచేస్తున్న సిబ్బంది భద్రతను కాపాడేందుకు అధికారులు, గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాగ్రత్తగా సాగిన తవ్వకాలు సొరంగం పనులకు నేతృత్వం వహిస్తున్న భారత సైన్యానికి చెందిన సొరంగ నిర్మాణ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఇన్‌లెట్ వద్ద ఎదురైన పరిస్థితులను వివరించారు.




