Shaligouraram: మూసీలో ఇసుక తవ్వకాలు ఆపాలి శాలిగౌరారంలో డిమాండ్
Shaligouraram: శాలిగౌరారంలో రౌండ్ టేబుల్ సమావేశంలో మూసీ నది ఇసుక మైనింగ్ నిలిపివేయాలని డిమాండ్; 20కి పైగా గ్రామాలకు ముప్పుపై ఆందోళన, కమిటీ ఏర్పాటు.
Shaligouraram: మూసీలో ఇసుక తవ్వకాలు ఆపాలి శాలిగౌరారంలో డిమాండ్
శాలిగౌరారం: మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇసుక మైనింగ్ చేపట్టడం వల్ల నదీ పర్యావరణం, భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు, గ్రామాల జీవనాధారాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేసి, ప్రజల జీవనాధారాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శాలిగౌరారం మండలకేంద్రంలోని జె.ఎం.జె. స్కూల్లో పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పార్టీ డివిజన్ కార్యదర్శి అంబటి చిరంజీవి అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి సాగర్, బి.ఆర్.ఎస్.కే.వి మండల అధ్యక్షుడు మామిడి రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు తోట వినోద్ కుమార్, కొప్పుల నర్సింహా దళిత సంఘం నాయకులు మాట్లాడారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో చిత్తలూరు, వంగమర్తి, ఇటుకలపహాడ్, తుడిమిడి గ్రామాలతో పాటు నదికి ఇరువైపులా ఉన్న 20కి పైగా గ్రామాలు నదీ కోతలు, భూగర్భ జలాల తగ్గుదల, వ్యవసాయ భూముల నష్టపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. నదీగర్భంలో భారీ యంత్రాలతో లోతుగా ఇసుక తవ్వకాలు చేపడితే నది సహజ ప్రవాహ స్వభావం దెబ్బతిని, తీర ప్రాంతాలు కోతకు గురై, బావులు, బోర్లలో నీటి మట్టాలు తగ్గి రైతాంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇసుక అనేది కేవలం నిర్మాణ రంగానికి అవసరమైన వనరు మాత్రమే కాదని, నదీ వ్యవస్థలో నీటి నిల్వలు, భూగర్భ జలాల పునరుద్ధరణ, పర్యావరణ సమతుల్యతను కాపాడే సహజ సంపద అని అన్నారు. ఇసుకను విచ్చలవిడిగా తవ్వి తరలించడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రజల అభిప్రాయాలను, పర్యావరణ ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇసుక మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. నదులు, వాగులు, వ్యవసాయ భూములు, గ్రామాల భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల ప్రతిపాదనలను రద్దు చేయాలని, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, నదీ పర్యావరణాన్ని, రైతుల జీవనాధారాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మూసీ పరిరక్షణ సమితి ఏర్పాటు కోసం తాత్కాలిక కో ఆర్డనేషన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ జిల్లానాయకులు వేముల శంకర్, డివిజన్ నాయకులు రావుల లింగయ్య, ఏ ఐ కే ఎం ఎస్ సహాయ కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, సిలువేరు జానయ్య, జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి, ఏనుగు సత్తిరెడ్డి, బి ఆర్ ఎస్ వి రాచకొండ గణేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.




