Suryapet: 22A భూముల వివాదం నుంచి రేవంత్ తప్పించుకోలేరు: జగదీష్ రెడ్డి!
Suryapet: ఎన్ని డ్రామాలు చేసినా 22A నుంచి సీఎం రేవంత్ తప్పించుకోలేరన్న జగదీష్ రెడ్డి. సాగర్ ఎడమ కాలువ నీటి తరలింపుపై మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలపై తీవ్ర ఆగ్రహం.
Suryapet: 22A భూముల వివాదం నుంచి రేవంత్ తప్పించుకోలేరు: జగదీష్ రెడ్డి!
సూర్యాపేట: సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా 22A భూముల వివాదం నుంచి రేవంత్ రెడ్డి తప్పించుకోలేరని అన్నారు. ఇతరులపై ఆరోపణలు చేసి తప్పించుకోవడం తెలివితక్కువ వేషాలన్నారు. నిండు శాసనసభలో అబద్ధాలు చెప్పి దొరికిపోయిన దొంగ రేవంత్ అని విమర్శించారు.
దమ్ముంటే తమను అసెంబ్లీకి అనుమతించి చర్చ పెట్టాలని సవాల్ చేశారు. తమను బయటకు పంపి బ్యాట్స్‌మెన్ లేకుండా బౌలింగ్ చేస్తున్నారని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో సిక్సర్లు, బౌండరీలతో మోత మోగిస్తామని అన్నారు.
ఎర్రవల్లి భూముల సర్వేలో రేవంత్ ప్రభుత్వానికి దళితుల నుంచి చుక్కెదురైందన్నారు. కేసీఆర్ తమకు నీళ్లిచ్చి సాగు చేసుకునే అవకాశం ఇచ్చారని, తమ భూముల్లో తామే ఉన్నామని దళితులే చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారన్నారు. ఇప్పటివరకు నోటీసులు ఇవ్వకుండా ఫామ్ హౌస్ చుట్టూ సర్వే పేరుతో తిరగడం డ్రామా పొడిగింపు కోసమేనని ఆరోపించారు.
22A పేరుతో లక్షలాది కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తూ, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు గుంజుకుంటున్నారని ఆరోపించారు. తోడేళ్లలా జనాన్ని భయపెట్టి 30% నుంచి 40% భూములు లాగేసుకుంటూ దందా చేస్తున్నారని విమర్శించారు.
సాగర్ ఎడమ కాలువ రైతుల అంశంపై మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా మంత్రుల చేతగానితనం బయటపడిందన్నారు. ఎడమ కాలువ తూములన్నీ బంద్ పెట్టాలని ENC ఉత్తర్వులు ఇవ్వడం వెనుక కుట్ర ఉందన్నారు. ఇక్కడి రైతులను ఎండబెట్టి ఖమ్మం వైరాకు నీటిని తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒక్క ఎకరం ఎండినా దానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలే బాధ్యులని, పొలాలు ఎండబెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.




