Suryapet: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి!

Suryapet: నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి రాజకీయ, విద్యా నేపథ్య విశేషాలు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 30 Sept 2026 11:49 AM IST
Suryapet
X

Suryapet: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి!

Suryapet: రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్న యువ నేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. ప్రస్తుతం నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మరోసారి చర్చనీయాంశమైంది.

విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి..

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడిగా రాజకీయ వాతావరణంలో పెరిగిన సర్వోత్తమ్ రెడ్డి.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. విద్యార్థి విభాగం కార్యకలాపాలతో చురుకైన పాత్ర పోషిస్తూ యువత, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ కార్యకర్తలతో సమన్వయం పెంచుకున్నారు.

తండ్రి, బాబాయ్ వారసత్వం..

సర్వోత్తమ్ రెడ్డికి బలమైన రాజకీయ వారసత్వం ఉంది. తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 సార్లు (తుంగతుర్తి నుంచి 4 సార్లు - 1985, 1989, 1994 స్వతంత్రంగా, 2004; సూర్యాపేట నుంచి 2009) విజయం సాధించి, రెండు సార్లు మంత్రిగా (1991-92 భూగర్భ జలవనరులు, 2008-09 ఐటీ) పనిచేశారు.

ఆయన బాబాయ్, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి 1967-77లో పాతలింగాల సర్పంచ్ గా మొదలై 5 సార్లు ఎమ్మెల్యేగా (సుజాతనగర్ నుంచి 3 సార్లు, పాలేరు నుంచి 2 సార్లు) గెలిచి మంత్రిగా, పీఏసీ చైర్మన్ గా సేవలందించారు. తండ్రి అనుభవాన్ని దగ్గరగా గమనిస్తూనే తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ.

ఏఐసీసీ సభ్యుడిగా.. ప్రజల్లో..

ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తుంగతుర్తి ప్రాంతంలో ప్రజాదర్బార్ కార్యక్రమాలను ఆయన నేతృత్వంలో కొనసాగిస్తున్నారు. ఇటీవల అక్టోబర్ 9న జరగనున్న TGSRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో TWU-SWF కూటమి తరపున సూర్యాపేట డిపోలో ప్రచారం నిర్వహించి కార్మిక వర్గంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.

యువతతో అనుసంధానం, కార్యకర్తలతో సమన్వయం, ప్రజా సమస్యలపై స్పందనతో తనదైన ముద్ర వేస్తున్న సర్వోత్తమ్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ రావడం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో అధ్యాయానికి నాందిగా మారింది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA