Kodad: కోదాడ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులపై దాడి..తీవ్ర కలకలం!
Kodad: కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వార్డెన్ సెల్ ఫోన్ పోయిందనే నెపంతో విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి చైర్మన్ కొట్టడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Kodad: కోదాడ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులపై దాడి..తీవ్ర కలకలం!
Kodad: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ సెల్ ఫోన్ పోయిందనే నెపంతో విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి పాఠశాల చైర్మన్ తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ అమానుష ఘటనపై తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అరవింద్ తల్లి పాఠశాల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి గుండెకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్య ఉందని, అప్పు చేసి మరీ ఏడాదికి ₹75,000 ఫీజు చెల్లిస్తూ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నామని ఆమె వాపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అని కూడా చూడకుండా చైర్మన్ అమానుషంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తన కుమారుడిని ఎందుకు కొట్టారని ప్రిన్సిపాల్‌ను నిలదీయగా ఎవరో ఒకరు కొట్టి ఉంటారు అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధిత విద్యార్థి తల్లి ఆరోపించారు. పిల్లల భద్రతను పక్కనపెట్టి యాజమాన్యం ఇలా వ్యవహరించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో విద్యార్థులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.




