Huzurnagar: హుజూర్‌నగర్‌లో ఘనంగా ప్రజానాట్యమండలి స్వర్ణోత్సవ సంబరాలు!

Huzurnagar: హుజూర్‌నగర్‌లో ప్రజానాట్యమండలి స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 16 Nov 2026 1:12 PM IST
Huzurnagar
X

Huzurnagar: హుజూర్‌నగర్‌లో ఘనంగా ప్రజానాట్యమండలి స్వర్ణోత్సవ సంబరాలు!

Huzurnagar: ప్రజా సమస్యలపై కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రజానాట్యమండలి చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్య పద్మ అన్నారు. హుజూర్‌నగర్‌లో ప్రజానాట్యమండలి స్వర్ణోత్సవ సంబరాలు జిల్లా అధ్యక్షులు దొంతగాని సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ గుండా రమేష్ స్వాగత ఉపన్యాసం చేయగా, పశ్య పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ ప్రజానాట్యమండలి అధ్యక్షులు కామ్రేడ్ కే. శ్రీనివాస్,బీసీ సంఘాల రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ధనుంజయ నాయుడు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంబాల శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జడ శ్రీనివాస్, ప్రముఖ పాత్రికేయులు కేఎస్ఎన్ ప్రసాద్, రిటైర్డ్ టీచర్ కేవీఎన్ మూర్తి, కామ్రేడ్ ఎం. వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ అంజయ్య, పదవ వార్డ్ కౌన్సిలర్ కామ్రేడ్ సైదులు, ప్రముఖ పౌరాణిక రంగస్థలం నటి వీరమణి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పీడిత ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘంగా ప్రజానాట్యమండలి ఏర్పాటైందని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను కళారూపాల ద్వారా ఎండగడుతూ, కాళ్లకు గజ్జెలు కట్టి విప్లవ గీతాలు ఆలపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన ఘనత ప్రజానాట్యమండలి కళాకారులదని కొనియాడారు.

నేడు కొంతమంది శతకోటీశ్వరుల చేతుల్లో భారత రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల హక్కులు, ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు కమ్యూనిస్టు పార్టీల అవసరం ఉందన్నారు.

ప్రజాస్వామిక విలువల కోసం పోరాడుతున్న యువతీ యువకుల సేవలు కమ్యూనిస్టు ఉద్యమాలకు అవసరమని పేర్కొన్నారు. ప్రజల కోసం త్యాగాలు చేసిన పోరాటయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

1974లో ప్రారంభమైన ప్రజానాట్యమండలి ప్రస్థానంలో భాగంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తూ, నాటి పోరాటయోధుల ఘన చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని పశ్య పద్మ అన్నారు. ఈ చారిత్రక కార్యాచరణకు కృషి చేసిన జిల్లా అధ్యక్షులు దొంతగాని సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు, విప్లవ గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. స్వర్ణోత్సవ వేడుకలు కళాకారులు, నాయకులు, అభిమానుల సమక్షంలో ఉత్సాహభరితంగా ముగిశాయి.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR