Chityal: వెలిమినేడు వద్ద నూతన ఆర్ఎంసీ ప్లాంట్‌పై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

Chityal: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఆర్ఎంసీ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 25 Oct 2026 4:06 PM IST
Chityal
X

Chityal: వెలిమినేడు వద్ద నూతన ఆర్ఎంసీ ప్లాంట్‌పై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం వెలిమినేడు వద్ద నూతనంగా నిర్మించనున్న ఆర్ఎంసీ ప్లాంట్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే ప్లాంట్ నిర్మాణం చేపడుతుండటంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి కారణంగా చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ప్లాంట్ సమీపంలో వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె ప్రకృతి వనం, జనావాసాలు ఉండటంతో దుమ్ము, ధూళి ప్రభావం ప్రజారోగ్యంపై పడే అవకాశం ఉందని నాయకులు పేర్కొన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమైతే పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత దెబ్బతినడంతో పాటు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వెలిమినేడు ప్రజలకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ప్రజారోగ్యంపై దాని ప్రభావాన్ని అధికారులు పరిశీలించాలని కోరాయి.

ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆర్ఎంసీ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA