Nutankal: సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామంలో 46 ఏళ్లుగా లేని దసరా సంబరాలు!

Nutankal: సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామంలో గత 46 ఏళ్లుగా జరగని దసరా వేడుకలు. 1980 నాటి రాజకీయ కక్షల నేపథ్యంలో పండుగకు దూరంగా ఊరు. గ్రామస్తుల ఆకాంక్ష.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 20 Oct 2026 3:27 PM IST
Nutankal
X

Nutankal: సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామంలో 46 ఏళ్లుగా లేని దసరా సంబరాలు!

Nutankal: దొరల గడీలపై తిరగబడ్డ విప్లవ పోరాటాల గడ్డ, ఎందరో యోధులను అందించిన విప్లవాల కిల్లా చిల్పకుంట్ల గ్రామంలో గత 46 ఏళ్లుగా జమ్మి ఆకుల సందడి లేదు. పాలపిట్ట దర్శనం లేదు దసరా పండుగ కోలాహలమే కనిపించదు. ఒకనాటి రాజకీయ వైరం గ్రామంలోని పండుగ వాతావరణాన్ని శాశ్వతంగా దూరం చేసింది.

1980 నాటి ఎన్నికల సెగ.. పండుగ పూట రగిలిన చిచ్చు

1980లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ, విప్లవ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ హోరాహోరీ పోరులో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి తొట్ల మల్సూరుపై, విప్లవ పార్టీకి చెందిన బాణాల చంద్రారెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు.

ఎన్నికల వేడి చల్లారకముందే వచ్చిన దసరా పండుగ వేళ గ్రామంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా కుల పెద్దలకు, నూతన సర్పంచ్‌కు కంకణం కట్టే క్రమంలో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి తీవ్ర వివాదం చెలరేగింది. ఆ ఘర్షణ కాస్తా కర్రలు, రాళ్ల దాడులకు దారితీసి గ్రామాన్ని అగ్నిగుండంగా మార్చింది. అనేకమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు.

పండుగంటే తెలియని తరం

ఆ రక్తసిక్త ఘర్షణలతో భయాందోళనకు గురైన గ్రామస్తులు, నాటి నుంచి దసరా పండుగ ఉత్సవాలను నిర్వహించడమే పూర్తిగా పక్కన పెట్టేశారు. కాలక్రమంలో అది ఓ అలిఖిత నిబంధనగా మారిపోయింది. ఫలితంగా నేడు 45 ఏళ్ల వయస్సున్న వారికి కూడా తమ సొంత ఊరిలో దసరా సంబరాలు ఎలా ఉంటాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇప్పటి యువతరానికైతే అసలు గ్రామంలో దసరా ఎందుకు జరుపుకోవడం లేదో కూడా పూర్తిగా తెలియదు.

ఐక్యతతో వేడుకలు జరుపుకోవాలని యువత ఆకాంక్ష

గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను, పాత కక్షలను పక్కనపెట్టి ఊరంతా ఒక్కటి కావాలని నేటి యువత, గ్రామస్తులు కోరుకుంటున్నారు. కుల సంఘాలు, ప్రజా సంఘాలు, గ్రామ పెద్దలు చొరవ తీసుకుని శాంతియుత వాతావరణంలో అన్యోన్యంగా విజయదశమి వేడుకలను పునఃప్రారంభించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. దశాబ్దాల నిశ్శబ్దానికి తెరదించి, ఊరంతా కలిసి ‘అలయ్-బలయ్’ తీసుకునే రోజు రావాలని ఆశిస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA