Nalgonda: నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం.. మంత్రి!
Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, రూ.10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Nalgonda: నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం.. మంత్రి!
Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని కథాల్ గూడ వద్ద 10 కోట్ల రూపాయల వ్యయంతో కథాల్ గూడా నుండి రాజీవ్ గృహకల్ప గృహ సముదాయం వరకు 3 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రోడ్డు విస్తరణ ,పటిష్ట పరిచే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25వేల కోట్ల రూపాయలతో హ్యం రోడ్లను చేపట్టడం జరిగిందని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి రోడ్లు వేయటంలేదని, ముఖ్యంగా మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు, గ్రామాల నుండి మండల కేంద్రాల వరకు డబుల్ రోడ్లను వేస్తున్నట్లు తెలిపారు.
సుమారు 9000 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మిస్తున్నామని, నల్గొండ జిల్లాలో 2000 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.రహదారుల అభివృద్ధిలో భాగంగా నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు ఆరు లైన్ల రహదారిని 50 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగిందని, అలాగే ధర్వేశిపురం నుండి కనగల్ వరకు హ్యం రోడ్డు చేపట్టామన్నారు.
కథాల్ గూడా రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన ఆర్ అండ్ బి అధికారులను ఆదేశిస్తూ పనులు నాణ్యతగా చేపట్టాలని చెప్పారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కార్పొరేషన్ లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర నిధులతో ఆర్టీసీ డిపోను పూర్తిగా ఆధునికరించడం జరిగిందని, కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటికి నల్లాలు ఏర్పాటు చేయడం, అలాగే 24 గంటలు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంతున్నామని, వీటన్నిటిని రానున్న ఒకటిన్నర సంవత్సరాలలో పూర్తి చేస్తామని వెల్లడించారు.రోడ్లతోపాటు, నల్గొండ పట్టణంలో పేదవారికి ఇళ్ల కేటాయింపులో భాగంగా హౌసింగ్ బోర్డ్ పక్కనే స్థలాన్ని కేటాయించామని, జి ప్లస్ త్రీ మోడల్ లో 500 గృహాలను ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇస్తామని మంత్రి వెల్లడించారు.
అంతకు ముందు... మంత్రి భవిత కేంద్రం ఆవరణలో 17 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సమీకృత మండల కాంప్లెక్స్ భవన సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఎం ఎల్ సి శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి ,ఆర్ అండ్ బి ఎస్ ఈ మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ గణేష్, ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, ఇతర అధికారులు, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకురి సుమలత సంతోష్ గౌడ్ ,ఇతర ప్రజాప్రతినిధులు ,తదితరులు ఉన్నారు.




