Nalgonda: ఇథనాల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలి

Nalgonda: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 14 Nov 2026 8:16 PM IST
Nalgonda
X

Nalgonda: ఇథనాల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలి

నల్గొండ: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ నెల 20 తేదిన ఏర్పాటు చేయదలచిన 600 KLD ఇథనాల్/డిస్టిలరీ పరిశ్రమతో పాటు 15 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌పై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ పరిశ్రమ ఏర్పాటుతో పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, భూగర్భ జలాలు, కృష్ణా నది మరియు అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ స్థానికుడు రామావత్ వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ధీరవత్ శ్రీనునాయక్ సామాజిక కార్యకర్త నక్క శ్రీనివాస్ ఉన్నతాధికారులకు అత్యవసర ఫిర్యాదు చేశారు.

ఈ నెల 20-11-2026న నిర్వహించనున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలని లేదా నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్ నల్లగొండ తదితర అధికారులను కోరారు.

కంపెనీ సమర్పించిన వివరాల ప్రకారం వీర్లపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 111, 112, 113, 212, 213, 214, 215, 218, 219, 220, 221, 222, 223, 224, 225, 253లలో మొత్తం 108.82 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదించారని

ఫిర్యాదులో పేర్కొన్నారు.

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో 30 రోజుల ముందస్తు సమాచారం పత్రికా ప్రకటనలు అందుబాటులో ఉంచలేదని10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలకు తగిన సమాచారం అందించలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. పూర్తి స్థాయి EIA నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచడంలోనూ స్పష్టత లేదని పేర్కొన్నారు.

రిజర్వ్ ఫారెస్ట్‌కు సమీపంలో పరిశ్రమ ఏర్పాటు ప్రమాదకరం

కంపెనీ నివేదిక ప్రకారం ప్రతిపాదిత పరిశ్రమకు వీర్లపాలెం రిజర్వ్ ఫారెస్ట్ కేవలం 1.05 కిలోమీటర్ల దూరంలో ఉందని అటవీ ప్రాంతంలోని జీవవైవిధ్యంపై పరిశ్రమ కాలుష్యం ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణా నది నీటిని పరిశ్రమకు మళ్లిస్తారా?

కృష్ణా నది పరిశ్రమకు సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉందని, రోజుకు 2,800 కిలోలీటర్ల నీటిని వినియోగించనున్నట్లు కంపెనీ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. ఈ నీటి వినియోగం వల్ల పరిసర ప్రాంతాల రైతుల సాగునీటి అవసరాలు, ప్రజల తాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుంగపహాడ్, గోరి, గడిదెల వాగుల ద్వారా వ్యర్థాలు కృష్ణా నదిలో కలిసే ప్రమాదాన్ని కూడా అధికారులు పరిశీలించాలని కోరారు.

బూడిద, వ్యర్థాలతో పంటలకు నష్టం జరిగే ప్రమాదం

పరిశ్రమలో రోజుకు వందల టన్నుల వరి పొట్టు లేదా బొగ్గు వినియోగం, బూడిదతో పాటు ఇతర పారిశ్రామిక వ్యర్థాలు వెలువడే అవకాశం ఉందని కంపెనీ నివేదికలోని వివరాలను ప్రస్తావించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు, ఉపరితల జలాల నాణ్యతపై నివేదికలో పేర్కొన్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.

29 గ్రామాల ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి

ఈ పరిశ్రమ ప్రభావం సుమారు 29 గ్రామాలకు, 1,27,893 మంది జనాభాకు సంబంధించిన వ్యవసాయం, తాగునీరు, ప్రజారోగ్యంపై పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రీన్ బెల్ట్ ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి, ప్రమాదాలు సంభవించినప్పుడు వైద్య సదుపాయాలు, వ్యర్థాల శుద్ధి విధానం వంటి కీలక అంశాలపై కంపెనీ స్పష్టమైన వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజల జీవించే హక్కు, పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనాధారాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని, ప్రజలకు పూర్తి సమాచారం అందించి చట్టబద్ధమైన విధానంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని, పర్యావరణ నిబంధనలన్నీ పరిశీలించిన తర్వాతే పరిశ్రమకు అనుమతులపై నిర్ణయం తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA