Nadigudem: కోతుల దాడి భయంతో పరుగెత్తి బాలుడు మృతి!
Nadigudem: వల్లాపురంలో కోతుల దాడి భయంతో పరుగెత్తి కిందపడి 12 ఏళ్ల బాలుడు నిశాంక్ గౌడ్ మృతి. కోదాడ ఆస్పత్రికి మృతదేహం తరలింపు, గ్రామంలో తీవ్ర ఆందోళన.
Nadigudem: కోతుల దాడి భయంతో పరుగెత్తి బాలుడు మృతి!
నడిగూడెం: మండలంలొని వల్లాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపు దాడి చేయడంతో భయాందోళనకు గురైన 12 ఏళ్ల బాలుడు పరుగులు తీస్తూ బోర్ల కింద పడటంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్రామానికి చెందిన మొక్క వీరబాబు కుమారుడు నిశాంక్ గౌడ్ (12) శుక్రవారం సాయంత్రం ఆడుకునేందుకు వెళ్తుండగా కోతుల గుంపు వెంటపడినట్లు సమాచారం. కోతుల దాడితో భయపడిన బాలుడు పరుగులు తీస్తూ బోర్ల కింద పడిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గ్రామంలో సుమారు 1,000 నుంచి 2,000 వరకు కోతులు ఉన్నాయని గ్రామ సర్పంచ్ తెలిపారు. కోతుల బెడదతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా చిన్నపిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




