Munugode: ఎల్ నినో కరువును సమష్టిగా ఎదుర్కొందాం: కోమటిరెడ్డి!
Munugode: ఎల్ నినో కరువును ఎదుర్కోవడంలో మునుగోడుపై దృష్టి పెట్టాలని, డిండి ప్రాజెక్టుతోనే శాశ్వత పరిష్కారమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Munugode: ఎల్ నినో కరువును సమష్టిగా ఎదుర్కొందాం: కోమటిరెడ్డి!
మునుగోడు: డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితేనే మునుగోడు నియోజకవర్గంలో కరువుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది - మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మునుగోడు లోని శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు లాంటి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రాంతంలో శాశ్వత సాగునీటి, తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల కరువును పారదోలెందుకు డిండి ఎత్తిపోతల పథకం ఒకటే మార్గమని, అయితే గత ప్రభుత్వం డిండి ప్రాజక్ట్ డిజైన్ చేసింది కానీ నీరు ఎక్కడి నుండి తేవాలో ఆలోచించలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక సుదీర్ఘ చర్చలు జరిపి ఏదుల రిజర్వాయర్ ద్వారా నీరు తెచ్చేలా నిధులు మంజూరు చేయించామని, డిండి సమస్య సున్నితమైంది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులను ఒప్పించి నీళ్లు తెచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు.
మన నీటిని మనం పొదుపు చేసుకుంటే చెరువుల ద్వారా సాగవుతుందని,ఇందుకు 300 కోట్ల రూపాయాలిస్తే నియోజక వర్గం లోని చేరువులన్ని నీటితో నింపి సస్యశ్యామలం చేస్తామన్నారు.తాగు, సాగు నీరు,విద్య,వైద్యం,రోడ్లపై పలుమార్లు తాను సమీక్షలు చేసామని, మునుగోడు నియోజకవర్గం పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ప్రభుత్వం కరువులో రైతులను ఆదుకోవాలి, దొడ్డు ధాన్యం తేమ శాతాన్ని 17 శాతం నుండి పెంచాలి,మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి సన్నధాన్యం ధరను తగ్గిస్తున్నారు.
ప్రభుత్వం ఒకవేళ కరువు పంట నష్ట పరిహారం ఇస్తే కౌలు రైతులకు ఇవ్వాలన్నారు.సంప్రదాయ వ్యవసాయం చేస్తే రైతులు లాభపడటం లేదని, ఆర్గానిక్,కమర్శియల్ వ్యవసాయం చేస్తేనే లాభపడతారని, ఆ దిశగా,నియోజకవర్గంలో ప్రయత్నిస్తున్నామన్నారు. చెరువులు,కుంటలు,చెక్ డ్యాములు ఎలా నింపాలో ప్రణాళిక రూపొందించాలని, వచ్చే సీజన్ లో వీటిని నింపుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తో కోరారు.
తాగునీటికి మునుగోడు నియోజక వర్గానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని,పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్ ఆపాలని కోరారు.శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మునుగోడు నియోజక వర్గంలో 100 కి 80 శాతం పత్తి రైతులున్నారు, కానీ ఎల్ నినో కారణంగా ఎకరాకు 1, 2 కింటాళ్ళు మాత్రమే వస్తున్నదని, ఎల్ నినో ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి, పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి,
విపత్తు లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, రైతాంగాన్ని ఆదుకోవాలి,గ్రామీణ ప్రాంతాలలో నీటి ఎద్దడి నివారణకు ఆలోచించాలి, అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలి, మునుగోడు,దేవరకొండలలో తీవ్ర కరువు పరిస్థితులున్నాయి, సాగు నీటికి అవకాశం లేదు,డిండి ఎత్తిపోతల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి,ఏదుల పనులు ప్రారంభించాలి, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలని కోరారు .జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్ నినో దృష్ట్యా అధికారులు,ప్రజా ప్రతినిధులు ముందుగా గ్రామాలు,మున్సిపాలిటీ వారిగా నీటివనరులు,
అందుబాటులో ఉన్న నీటిని విశ్లేషించాలి,మునుగోడు ప్రాంతంలో భూగర్భజలాలు తక్కువ,అధికారులు భూ ఉపరితలం పై ఉన్న నీటిని మాత్రమే వినియోగించాలి,నీటి నాణ్యత పరిశీలించిన తరువాతే ప్రజలకు నీరు అందించాలి,రైతులు సమిష్టిగా డిమాండ్ ఉన్న పంటలు పండించేందుకు ముందుకొస్తే సబ్సిడీ పై పరికరాలు,మార్కెటింగ్,ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
గట్టుప్పల్,మునుగోడు,చండూరు మండలాలలో వి బి జి రామ్ జి కింద ఉత్పాదక పనులు చేపట్టాలి,ప్రత్యేకించి జలసిరి పనులు చేపట్టాలి,ఎం పి డి ఓ లు వీటి పై సమీక్షించాలన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల పనుల బిల్లులు జిల్లాలో 7 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి, వాటిలో 2 లక్షల వరకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా సర్పంచులు మరిన్నీ పనులు చేపట్టాలి.
వచ్చే జులై వరకు నీటిని ఎలా సంరక్షించి ప్రజాలకందించాలో ఆలోచించాలి. ఎల్ నినో విపత్కర పరిస్థితులలో జిల్లా యంత్రాంగం ప్రజలకు,ప్రజాప్రతినిధులకు అండగా ఉంటుంది.అందరం కలిసి ప్రజలను ఆదుకుందామని అన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు, భూగర్భ, విద్యుత్, పౌర సరఫరాలు, తాగునీటి, మిషన్ భగీరథ ,గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులు ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కోవడం, ప్రత్యామ్నాయ పరిస్థితులు,ముందస్తు చర్యలపై సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.
సదస్సు ప్రారంభమైన వెంటనే సదస్సుకు హాజరైన వారందరు "నీటి ని పొదుపు చేద్దాం" నీటిని సంరక్షించుకొందామంటూ "నీటి ప్రతిజ్ఞ " చేశారు.స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్, కొందరు సర్పంచులు, తదితరులు మాట్లాడారు. శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, చండూరు ఆర్ డి ఓ శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్లు,ఇతర ప్రజాప్రతినిధులు,డివిజన్ ,మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.ఎల్ నినో పై డిపిఆర్ ఓ ఆధ్వర్యం లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సదస్సులో తమ పాటల ద్వారా చక్కటి అవగాహన కల్పించారు.




