Suryapet: అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయండి!

Suryapet: నల్లగొండలో నవంబర్ 15 నుంచి నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Nov 2026 11:14 AM IST
Suryapet
X

Suryapet: అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయండి!

Suryapet: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. నవంబర్ 15న నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతాంగం లక్షలాదిగా తరలిరావాలని కోరారు.

అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల గోడపత్రికను సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే మహాసభల్లో దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆమె విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతాంగానికి నష్టం కలిగించే విధంగా అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందని ఆరోపించారు. విత్తన రంగంలో కార్పొరేట్ శక్తుల ప్రవేశం వల్ల రైతులపై ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్ సవరణ చట్టం అమలులోకి వస్తే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ.50 వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాను పూర్తిస్థాయిలో కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టి, ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభకు మాజీ పార్లమెంటు సభ్యురాలు బృందా కారత్, అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి వీజు కృష్ణన్ హాజరవుతారని తెలిపారు. సూర్యాపేట జిల్లా నుంచి 25 వేల మంది రైతాంగాన్ని మహాసభలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు నాగారపు పాండు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి,

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న, రైతు సంఘం జిల్లా నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, మేరెడ్డి కృష్ణారెడ్డి, చిట్లంకి యాదగిరి, పిండిగా నాగమణి, మామిడి సుందరయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA