Suryapet: నవంబర్ 15న నల్లగొండ రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలి
Suryapet: నవంబర్ 15న నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలని మద్దిరాలలో పోస్టర్ ఆవిష్కరించి సీపీఎం నేత కోట గోపి పిలుపునిచ్చారు.
Suryapet: నవంబర్ 15న నల్లగొండ రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలి
సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి పిలుపునిచ్చారు.
మద్దిరాల మండల కేంద్రంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోట గోపి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే మహాసభల్లో దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. విత్తన రంగంలో కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో రైతులపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ చట్టం అమలులోకి వస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. సూర్యాపేట జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యురాలు బృందా కారత్, అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ హాజరుకానున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోట గోపి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పోలోజు సైదులు, మండల కమిటీ సభ్యులు దికొండ ఉపేందర్, నాయకులు కొమెర నరసయ్య, కృష్ణయ్య, మూతినేని రమేష్, కృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




