Nalgonda: పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ
Nalgonda: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఉమ్మడి అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ పేరు ఖరారైంది.
Nalgonda: పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ
Nalgonda: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన ప్రజా సంఘాల తరపున అభ్యర్థి ప్రకటన, పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొల్లి సత్యనారాయణను బరిలోకి దించుతూ పీడీఎఫ్ ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. ఓటర్లు డబ్బు, మద్యానికి అతీతంగా ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వారిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తులు ఎన్నికైతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో లేవనెత్తే వారని గుర్తుచేశారు.
ఆ తర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లు కూడా ఎవరూ గుర్తు పెట్టుకోని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే భావసారూప్యత కలిగిన వామపక్ష భావజాలం కలిగిన వారంతా ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణను ఎన్నికల్లో నిలబెడుతున్నట్టు తెలిపారు. సత్యనారాయణ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారనీ, న్యాయవాద వృత్తిలో ఉండి న్యాయవాదుల కోసం గళమెత్తారనీ, అభ్యుదయభావాలు కలిగిన మానవతావాది, సమస్యలపై అవగాహన కలిగిన వారని చెప్పారు. గతంలో పీడీఎఫ్ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్న సమయంలో శాసనమండలిలో ప్రజా సమస్యలు ఎక్కువగా చర్చకు వచ్చేవని గుర్తుచేశారు. మళ్లీ అలాంటి పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.
మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కొల్లి సత్యనారాయణ పోటీ చేయడానికి సిద్ధపడటమే గొప్ప విషయమని తెలిపారు. ప్రజా సంఘాలు భాగస్వాములై గెలిపించాలని కోరారు. ఉమ్మడి మూడు జిల్లాల్లో నేడు కొత్త జిల్లాలు 11 ఉన్నాయనీ, గతంలో 5.5 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం 2,90,000 మంది ఓటర్లు మాత్రమే నమోదు అయినట్టు వస్తున్న వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు నమోదయ్యేలా ప్రజా సంఘాలు ప్రయత్నించాలని సూచించారు. ఆరు రాష్ట్రాల్లోనే ఉన్న శాసనమండలి అంటే మేధావుల సభ, పెద్దల సభ అని తెలిపారు. ప్రముఖ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణను గెలిపించి పెద్దల సభకు పంపించేందుకు సిద్ధం కావాలని ఆయన ఓటర్లను కోరారు. నోటు లేని ఓటుతో మంచి వ్యక్తిని శాసనమండలికి పంపించాలని సూచించారు. తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితిని దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిలో కొల్లి సత్యనారయణ లాంటి వ్యక్తులు చట్టసభలకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రజా సంఘాలు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలకు దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన భావజాలం, నూతన సమాజం కోసం విద్యార్థి దశ నుంచే నిలబడ్డారని తెలిపారు. 634 అనుబంధ సంఘాలు కలిగిన సీఐటీయూ ఓటర్ల నమోదు నుంచి గెలుపు వరకు శాయశక్తుల కృషి చేస్తుందని చెప్పారు.
టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్.పద్మ మాట్లాడుతూ హక్కులు అడుగంటిపోతున్న వేళ, వాటిని సాధించుకునేందుకు సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ, మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి సత్యనారాయణ గెలిస్తే అందరి ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పారు.
టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓటర్ల నమోదులో వెనుకబడి ఉన్నామనీ, ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఉద్యమంలోనూ, ఆ తర్వాత జరిగిన పోరాటాల్లో దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచిన సత్యనారయణకు మద్దతు తెలిపారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ గతంలో గెలిచిన అభ్యర్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. కొల్లి సత్యనారయణ గెలిస్తే పట్టభద్రులు గెలిచినట్టే అని తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవితో పాటు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. పార్థసారధి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ల్ పద్మ .
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ అధ్యక్షులు స్వరూప, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణ మూర్తి, బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు పి.వెంకట్రామయ్య,
ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.సాంబశివరావు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ టి.సురేష్ కుమార్, డీవైఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఎ.వెంకటేష్, పీవైఎల్ ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్, టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు,
చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.రమణ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మానాయక్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్, రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.పద్మశ్రీ, ఎన్పీఆర్డీ
ప్రధాన కార్యదర్శి అడివయ్య, వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వరరావు,
యునైటెడ్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు భూపాల్, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు దుర్గా ప్రసాద్, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎం.దశరథ్, బీడీఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.సత్తయ్య
ఎల్ఐసి ఐఒఎ ప్రధాన కార్యదర్శి తన్నీరు కుమార్, ట్రాన్స్ పోర్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్, ఫిక్స్డ్ టర్మ్, నాన్ రెగ్యులర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పి.సుధాకర్, కల్లుగీత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు వి.వెంకట నర్సయ్య, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కె.శివకుమార్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.అజీజ్ తదితరులు మద్దతు తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటప్ప, సింహాచలం, ఐద్వా నాయకులు ఆశాలత, టాప్ర నాయకులు ఎల్. అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
గురుతర బాధ్యతను నిర్వర్తిస్తా
-కొల్లి సత్యనారాయణ
ప్రజా సంఘాలు ఉమ్మడిగా తనపై పెట్టిన గురుతర బాధ్యతను నిర్వర్తిస్తానని కొల్లి సత్యనారాయణ తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల చట్టాలు చేస్తున్న సమయంలో తన పట్ల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. కార్మికుల మాదిరిగానే న్యాయవాదులకు సమస్యలు ఉన్నాయన్నారు. నిరసన తెలిపే జంతర్ మంతర్ ను ఎత్తేస్తున్న కాలంలో వారికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఓట్ల నమోదు నుంచి ఓట్లు వేసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
సీఐటీయూ రూ.ఒక లక్ష విరాళం
కొల్లి సత్యనారయణ ఎన్నికల ప్రచారం కోసం సీఐటీయూ మొదటి విడతగా రూ.ఒక లక్ష విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ లు ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం మొదటి విడతగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు తెలిపారు.




