Kodad: కోదాడలో పోలీసు ఉద్యోగాల ఆశావహులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
Kodad: కోదాడ కేఆర్ఆర్ కళాశాలలో ఉచిత పోలీసు శిక్షణ పొందుతున్న 200 మంది అభ్యర్థులకు 11 పుస్తకాల స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసిన కలెక్టర్ తేజస్, ఎస్పీ నరసింహ.
Kodad: కోదాడలో పోలీసు ఉద్యోగాల ఆశావహులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
కోదాడ : పోలీసు ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని పట్టుదలతో చదవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ యువతకు సూచించారు.
జిల్లా యంత్రాంగం,పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కోదాడలోని కేఆర్ఆర్ కళాశాలలో ఉచితంగా శిక్షణ పొందుతున్న 200 మంది అభ్యర్థులకు కళాశాలలో బుధవారం 11 పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్ను కలెక్టర్,ఎస్పీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో లక్ష్యం, గమ్యం స్పష్టంగా ఉండాలని, వాటిని చేరుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి పరీక్షల సరళిపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరీక్షలకు ముందు కనీసం మూడుసార్లు పునశ్చరణ చేసుకోవాలని సూచించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట, తుంగతుర్తి ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాలో 400 మంది పోలీసు ఉద్యోగాల ఆశావహులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, అనుభవజ్ఞులైన పోలీసు సిబ్బందితో నాణ్యమైన శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ.. యువత విలాసాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదవాలని, నిరంతర సాధనతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ పోలీసు ఉద్యోగం సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా 1,400 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి, ప్రతిభ ఆధారంగా 400 మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యర్థులకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాలకు చెందిన 200 మందికి కోదాడలోనే శిక్షణ ఏర్పాటు చేశామని వివరించారు.
శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల గురించి వివరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ సైబర్ సెక్యూరిటీ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఇన్స్పెక్టర్లు రామారావు, శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి,ఆర్ఎస్ఐలు సాయిరాం,సురేష్, అన్వర్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.




