Suryapet: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలి!
Suryapet: ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలు రూ.42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
Suryapet: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలి!
Suryapet: కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను పెంచాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు కామల్ల శ్రీను అధ్యక్షతన చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తుంటే, వారికి కనీస వేతనాలు పెంచుతామని ఎన్నికలకు ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆచరించకుండా రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మినిమం టైం స్కేల్‌ను అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నదని, తక్షణమే వారిని శాశ్వతంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజేషన్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను రూ.42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో రాష్ట్రంలో 17,541 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని విమర్శించారు.
అసంఘటిత రంగ కార్మికులైన ఆటో మోటార్ రంగ, హమాలీ కార్మికులకు సమగ్ర భద్రత కూడిన ఎలాంటి చట్టాలు లేకపోవడంతో అభద్రతాభావంతో తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని, వారికి భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అత్యధిక కార్మికులు భవన నిర్మాణ రంగంలో ఉన్నారని, వీరికి అడ్డాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకుండా చట్టానికి విరుద్ధంగా లేబర్ అధికారులు వ్యవహరిస్తున్నారని, తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు వి. నరసింహారావు, దేశోజు మధు, జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, నాగవెల్లి రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.




