Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు!

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నివాళులర్పించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 2 Oct 2026 7:48 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు!

Suryapet: భారతదేశ సార్వభౌమాధికారానికి, సాంస్కృతిక వైభవానికి మూలస్తంభాలుగా నిలిచిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల ఆదర్శాలు ఎప్పటికీ ఆచరణీయమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని వారి చిత్రపటాలకు పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాల ద్వారా గాంధీజీ ప్రపంచానికి దిశానిర్దేశం చేశారని, ఉప్పు సత్యాగ్రహం వంటి చిన్న పిలుపుతో దేశ ప్రజలందరినీ ఏకం చేసిన మహాత్ముని మార్గదర్శకత్వం ఎనలేనిదని కొనియాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే బలమైన భారత్ సాధ్యమవుతుందన్న గాంధీజీ ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

దేశ రక్షణ, ఆహార భద్రతలో రైతులు, సైనికుల పాత్రను గుర్తించి 'జై జవాన్ - జై కిసాన్' నినాదాన్ని ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంతో దేశాన్ని నడిపించిన ఆయన జీవితం నవతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహనీయుల ఆదర్శాలను భావితరాలకు అందిస్తూ వారు చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రాగి ఉపేందర్ రావు, ఆడిట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ప్రసాద్, డీసీఓ శ్రీరామ్, డీఎం సివిల్ సప్లైస్ శ్రీధర్ రెడ్డి, డీబీసీడీఓ విశాల్, ఏడీ ఫిషరీస్ ఆంజనేయ శర్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA