Devarakonda: కాంగ్రెస్ హామీల అమలుపై మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ విమర్శలు

Devarakonda: కాంగ్రెస్ 'అభయహస్తం' మేనిఫెస్టో విడుదలై మూడేళ్లయిన సందర్భంగా హామీల అమలుపై దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మంగళవారం విమర్శలు చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 17 Nov 2026 2:51 PM IST
Devarakonda
X

Devarakonda: కాంగ్రెస్ హామీల అమలుపై మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ విమర్శలు

Devarakonda: కాంగ్రెస్ దొంగ హామీలకు నేటితో మూడేళ్లు అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....2023 నవంబర్ 17న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, అందులో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి నేటికీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.

62 ప్రధాన అంశాలతో 42 పేజీల్లో రూపొందించిన 'అభయహస్తం' మేనిఫెస్టోలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు కమిషన్ ఏర్పాటు వంటి ఎన్నో హామీలు ఇచ్చారని తెలిపారు. కానీ వాటిలో అనేక హామీలు నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

గొప్పగా ప్రచారం చేసుకున్న అభయహస్తం నేడు శూన్యహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మూడేళ్లుగా కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఓట్లు వేసిన ప్రజలను మాత్రమే కాకుండా, పవిత్ర గ్రంథాలను సాక్షిగా పెట్టుకుని ఇచ్చిన మాటను సైతం నిలబెట్టుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు.

తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు జరిగిన 38 క్యాబినెట్ సమావేశాల్లో ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గాంధీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ, గాంధీభవన్ సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆశలను ఓట్లుగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణ ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ నేటికీ అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు.

రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు, 24 గంటల ఉచిత విద్యుత్, పంట నష్టపరిహారం, రైతు బీమా వంటి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహిళలకు ప్రతి నెలా రూ.2,500 భృతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.4 వేల పింఛన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

నిరుద్యోగ యువతకు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల, సెప్టెంబర్ 17లోపు నియామకాల పూర్తి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యువతకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, వడ్డీలేని రుణాలు, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామన్న హామీలను కూడా అమలు చేయాలని కోరారు.

విద్యారంగంలో ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు, ఉచిత వైఫై, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల పెంపు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం, విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధుల కేటాయింపు వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుపై దృష్టి సారించడం లేదన్నారు.

అలాగే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, బీసీ సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత, అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు, బీసీ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ప్రతి మండలంలో బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

గౌడ, ముదిరాజ్, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, చేనేత కార్మికులు, చేతివృత్తుల వారికి ఇచ్చిన హామీలను సైతం ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రెండో విడత గొర్రెల పంపిణీ, గీత కార్మికులకు ఈత చెట్ల పెంపకానికి భూమి కేటాయింపు, 90 శాతం సబ్సిడీ, గౌడలకు మద్యం దుకాణాల లైసెన్సుల్లో 25 శాతం రిజర్వేషన్ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్నికల సమయంలో ఓట్లు పొందేందుకు మాత్రమే ఉపయోగించుకొని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని, మాటలతో కాలయాపన చేయకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. హామీల అమలులో జాప్యం చేస్తే ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు TVN రెడ్డి,రమావత్ దాస్రు నాయక్,మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీల రవికుమార్, గాజుల రాజేష్,బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు,ముత్యాల రవి కుమార్, బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ,సర్పంచూలు ఆడారపు హరికృష్ణ,బషీర్, కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు MD జనీబాబ, యువజన విభాగం రాష్ట్ర నాయకులు ఇలియాస్ పటేల్,మకాం చంద్రమౌళి, మాడెం రాములు,ఆఫ్రాజ్, వంగూరి పాపయ్య గౌడ్,గుండాల వెంకట్,తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA