Tirumalagiri: తిరుమలగిరిలో హోటళ్లు దాబాలపై ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు!
Tirumalagiri: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆహార భద్రతా అధికారులు హోటళ్లు, దాబాల్లో తనిఖీలు చేసి సోమేశ్వర దాబాలను సీజ్ చేయడంతో పాటు ఇతరులకు జరిమానాలు విధించారు.
Tirumalagiri: తిరుమలగిరిలో హోటళ్లు దాబాలపై ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు!
Tirumalagiri: తిరుమలగిరి పట్టణంలోని పలు హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులతో కలిసి ఆహార భద్రతా అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు హోటళ్లలో అపరిశుభ్రత, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, వాడిన నూనెను పదేపదే వినియోగించడం వంటి అంశాలను గుర్తించారు.
సోమేశ్వర ఫ్యామిలీ దాబా/రెస్టారెంట్ సీజ్
సోమేశ్వర ఫ్యామిలీ దాబా/రెస్టారెంట్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే గత రోజు మిగిలిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు, లైసెన్స్/రిజిస్ట్రేషన్ కూడా లేకపోవడాన్ని గుర్తించి అధికారులు రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.
చెర్రీ బార్ అండ్ దాబాకు రూ.10 వేల జరిమానా
చెర్రీ బార్ అండ్ దాబాలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం, అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించిన అధికారులు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించేందుకు సమయం ఇచ్చిన అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు.సురభి క్యాంటీన్‌లో కాలం చెల్లిన వస్తువులు సురభి క్యాంటీన్ అండ్ హోటల్‌లో ఎక్స్‌పైరీ అయిన ఉత్పత్తులతో పాటు పురుగులు పట్టిన బియ్యం, కందిపప్పును అధికారులు గుర్తించారు. నిర్వాహకులకు ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ రూ.2 వేల జరిమానా విధించారు.సునీత బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.2 వేల ఫైన్సు సునీత బార్ అండ్ రెస్టారెంట్‌లో సింథటిక్ కలర్స్ వినియోగించడంతో పాటు వాడిన నూనెను పదేపదే ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టెస్టింగ్ మీటర్ ద్వారా పరీక్షించగా ఆయిల్ విలువ 25 కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో పాటు అపరిశుభ్ర పరిస్థితుల నేపథ్యంలో రూ.2 వేల జరిమానా విధించారు.
బిల్లులు తప్పనిసరిగా నిర్వహించాలి
హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల నిర్వాహకులు తాము కొనుగోలు చేసే ప్రతి సరుకుకు సంతకం, సీలు, తేదీతో కూడిన సరైన బిల్లులను తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులు సూచించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలకు రంగులు కలిపి తాజాగా ఉన్నట్లు చూపించి వినియోగదారులను మోసం చేయవద్దని హెచ్చరించారు.అదేవిధంగా హోటళ్లు, బేకరీలు, బార్లు, రెస్టారెంట్లలో అధికంగా కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలను వినియోగించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను గమనించి ఆహారాన్ని తీసుకోవాలని అధికారులు కోరారు.




