Devarakonda: రెండు మండలాల్లో 1,412 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ

Devarakonda: దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో నూతన చేయూత పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పంపిణీ చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 17 Nov 2026 7:17 PM IST
Devarakonda
X

Devarakonda: రెండు మండలాల్లో 1,412 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ

దేవరకొండ: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు అన్నారు. ఈరోజు చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో నిర్వహించిన చేయూత ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, నేత కార్మికులు తదితర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలో కొత్త పెన్షన్ల మంజూరులో చింతపల్లి మండలం అత్యధిక స్థానంలో నిలిచిందని తెలిపారు. చింతపల్లి మండలంలో 858 మందికి, కొండమల్లేపల్లి మండలంలో 554 మందికి కలిపి మొత్తం 1,412 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా అర్హులైన అనేకమంది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ వారికి తగిన న్యాయం జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 లక్షల 60 వేల పెన్షన్లు మంజూరు చేసి పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు.

పెన్షన్ అనేది పేదలు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, నేత కార్మికులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వారి జీవితాలకు ఒక భరోసా అని అన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవనం కల్పించాలన్నదే రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా ప్రజా ప్రభుత్వం తన సంక్షేమ నిబద్ధతను చాటుకుంటోందని అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA