Devarakonda: ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం: ఎమ్మెల్యే!

Devarakonda: దేవరకొండ గిరిజానగర్ తండా బీసీ గురుకులంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, ఆర్డీవో వనజారాణితో కలిసి ప్రారంభించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 11 Nov 2026 7:44 PM IST
Devarakonda
X

Devarakonda: ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం: ఎమ్మెల్యే!

దేవరకొండ: దేవరకొండ మండలం గిరిజానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల 2026-27 జిల్లా స్థాయి క్రీడా పోటీల కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం క్రీడారంగ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్ద విద్యాశాఖ ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడంతోపాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

క్రీడలు విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక వికాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని, మేధాశక్తిని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పట్టుదలతో ముందుకు సాగాలని, ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థుల్లో ఎంతో క్రీడా ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాలకు చెందిన మొత్తం 15 గురుకులాల నుంచి అండర్-17 విభాగంలో ఒక్కో పాఠశాల నుంచి 35 మంది చొప్పున క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలు అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ పోటీల్లో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, హైజంప్, లాంగ్‌జంప్, చెస్ తదితర వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని తెలిపారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదిగేందుకు దోహదపడతాయని అన్నారు.

విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్న గురుకుల విద్యాసంస్థల అధికారులు, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని దేవరకొండ నియోజకవర్గానికి, నల్లగొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో వనజా రాణి, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, లోకసాని శ్రీధర్ రెడ్డి, కొర్ర రాంసింగ్ నాయక్, నేనావత్ బుజ్జి హరిలాల్ నాయక్, మండల సర్పంచులు, కొండూరు పవన్ కుమార్, అంగిరేకుల నాగభూషణం, మాస భాస్కర్, వైఎస్ కరుణాకర్, సంబంధిత శాఖల అధికారులు, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA