Kodad: జలదోపిడీని అరికట్టాలి.. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి: బొల్లం మల్లయ్య!
Kodad: నాగార్జున సాగర్ నుంచి జలదోపిడీని అరికట్టాలని, తొలగించిన 4.5 లక్షల పెన్షన్లను పునరుద్ధరించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
Kodad: జలదోపిడీని అరికట్టాలి.. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి: బొల్లం మల్లయ్య!
కోదాడ: ఒకవైపు నాగార్జున సాగర్ జలాశయం నుంచి 510 అడుగుల డెడ్ స్టోరేజ్ స్థాయి నుంచి నీటి తరలింపు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మరోవైపు అర్హులైన పేదలు, దివ్యాంగుల పెన్షన్లను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు.
సోమవారం కోదాడలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ జలాశయం నుంచి సొరంగాల ద్వారా నీటిని తరలించడం వల్ల సాగర్ ఆయకట్టు రైతులతో పాటు హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జలదోపిడీపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి తరలింపును అరికట్టాలని డిమాండ్ చేశారు.
కేఆర్ఎంబీకి ఉత్తరాలు రాయడం, అధికారులకు నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్తుందని, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు నాగార్జున సాగర్ డ్యామ్‌ను సందర్శించనున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల పెన్షన్లు తొలగించారని, కోదాడ నియోజకవర్గంలోనూ వేలాది మంది పెన్షన్లు కోల్పోయారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని 61 నుంచి 57 ఏళ్లకు తగ్గించి, రూ.2,000 పెన్షన్ అందించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4,000 పెన్షన్ హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
దివ్యాంగుల పెన్షన్ల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని, 60 నుంచి 70 శాతం వైకల్యం ఉన్నవారికి సైతం పెన్షన్లు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. సదరం సర్టిఫికెట్ల జారీ, పెన్షన్ల మంజూరులో అవకతవకలు ఉన్నాయని, అర్హులైన దివ్యాంగులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం హెలికాప్టర్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు, భారీ సమావేశాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని, కానీ జీవనాధారం కోసం పెన్షన్లపై ఆధారపడే వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. పెన్షన్ల జాబితాలను పునఃపరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




