Suryapet: కళ్లముందే ఎండిన పైరు.. పంటకు నిప్పు పెట్టిన కౌలు రైతు మల్లయ్య

Suryapet: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో కరెంట్ కోతలు, నీటి ఎద్దడితో పంట ఎండిపోవడంతో తట్టుకోలేక కౌలు రైతు యాతాకుల మల్లయ్య పంటకు నిప్పు పెట్టాడు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 26 Oct 2026 2:22 PM IST
Suryapet
X

Suryapet: కళ్లముందే ఎండిన పైరు.. పంటకు నిప్పు పెట్టిన కౌలు రైతు మల్లయ్య

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలానికి చెందిన ఓ కౌలు రైతు కథ కన్నీరు తెప్పిస్తోంది. యాతాకుల మల్లయ్య అనే రైతు నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేశాడు.

ఎకరానికి రూ.20,000 చొప్పున కౌలు చెల్లించడంతో పాటు దుక్కి దున్నడం, విత్తనాలు, ఎరువులు తదితర పెట్టుబడుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశాడు. అయితే తగినంత వర్షపాతం లేకపోవడం, మరోవైపు కరెంట్ కోతలు, బోరుబావుల్లో నీటి మట్టం పడిపోవడంతో పైరుకు సరిపడా నీరు అందలేదు.

చేతికి అందాల్సిన సమయంలో పంట కళ్లముందే ఎండిపోయింది. సాగు చేసిన నాలుగు ఎకరాల్లో దాదాపు మూడు ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రైతు, ఆ పంట ఇక ఎందుకూ పనికిరాదన్న వేదనతో ఎండిన చేనుకు నిప్పంటించాడు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.

"నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను... ఒక ఎకరానికి రూ.20,000 కౌలు ఇవ్వాలి. దున్నుడు, ఇతర ఖర్చులకు మరో రూ.20,000 అయ్యాయి. వర్షాలు లేక, కరెంట్ లేక నీళ్ల సమస్య తీవ్రమైంది. నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు కౌలు డబ్బులు, పెట్టిన పెట్టుబడులు ఎట్లా కట్టాలి? నాకున్న భార్య, ఇద్దరు పిల్లలను ఎలా పోషించుకోవాలి? మేము బతికే పరిస్థితి కూడా కనిపించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA