Suryapet: సూర్యాపేట జిల్లాలో పోలీసు పహారా మధ్య డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రా!

Suryapet: సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం చిల్పకుంట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపికపై సీపీఎం అభ్యంతరం. పారదర్శకత పాటించాలని డిమాండ్.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 5 Oct 2026 12:37 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో పోలీసు పహారా మధ్య డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రా!

Suryapet: సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండల కేంద్రంలో చిల్పకుంట్ల గ్రామానికి చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. ఇళ్ల కేటాయింపు కోసం డ్రా నిర్వహించడంతో చిల్పకుంట్ల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మండల కార్యాలయానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిల్పకుంట్ల గ్రామంలో ఇప్పటికే 30 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అయితే కొంతమంది ఇళ్లలో ఇప్పటికే నివాసం ఉంటున్నారని, వారు అధికారికంగా ఎంపికైన లబ్ధిదారులు కాదని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి, వారి ఎంపిక కోసం డ్రా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎంపికైన లబ్ధిదారులను మండల కార్యాలయంలోని సమావేశ మందిరానికి తరలించి, పోలీసుల పర్యవేక్షణలో డ్రా ప్రక్రియ చేపట్టారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మండల కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రా అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించనున్నారు. డ్రా విధానంపై సీపీఎం అభ్యంతరం. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు.

అర్హులైన పేదలను సమగ్రంగా గుర్తించి ఇళ్లు కేటాయించకుండా కేవలం పేర్లు నమోదు చేసి డ్రా నిర్వహించడం సరికాదని పేర్కొంటూ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాల్సి ఉండగా, డ్రా పద్ధతిలో కొందరికి మాత్రమే ఇళ్లు కేటాయించడం వల్ల అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతుందని సీపీఎం నాయకులు ఆరోపించారు. చిల్పకుంట్ల గ్రామంలో భూమి లేని సుమారు 75 మంది నిరుపేదలు ఉన్నారని, వారందరినీ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామంలో సీపీఎంకు చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్, పాలక మండలి ఉన్నప్పటికీ వారిని సంప్రదించకుండా ఇళ్ల పంపిణీ ప్రక్రియ చేపట్టడం సరికాదని విమర్శించారు. ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని కోరారు.

రహదారి హామీ అమలు చేయాలని డిమాండ్

చిల్పకుంట్ల నుంచి నూతన్‌కల్ మీదుగా సంగెం వరకు రహదారి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎందుకు ముందుకు సాగలేదో ప్రభుత్వం, అధికారులు స్పష్టం చేయాలని కోరారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించి అర్హులైన పేదలందరికీ న్యాయం చేయడంతో పాటు, చిల్పకుంట్ల–నూతన్‌కల్–సంగెం రహదారి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy