Suryapet: నవంబర్ 1-9 వరకు గ్రామగ్రామాన అమరవీరుల సంస్మరణ సభలు!

Suryapet: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుండి 9 వరకు విప్లవ అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని సీపీఐ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 1 Nov 2026 8:43 AM IST
Suryapet
X

Suryapet: నవంబర్ 1-9 వరకు గ్రామగ్రామాన అమరవీరుల సంస్మరణ సభలు!

Suryapet: భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నవంబర్ 1 నుండి 9 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నవంబర్ 1న కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య 50వ వర్ధంతి సందర్భంగా, అలాగే నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి, నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, గొట్టెముక్కుల జానకిరామిరెడ్డి తదితర విప్లవకారుల సంస్మరణ సభలు నిర్వహించాలని కోరారు.

కామ్రేడ్ పొట్ల రామనర్సయ్యను 1976 నవంబర్ 1న నాటి నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేసిందని తెలిపారు. భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప విప్లవ నాయకుడు రామనర్సయ్య అని పేర్కొన్నారు.

కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విప్లవోద్యమ నిర్మాణానికి, ప్రజా ఉద్యమాల అభివృద్ధికి విశేష కృషి చేశారని, ఆయన నాయకత్వంలో అనేక పోరాటాలు ప్రజల హక్కుల సాధనకు బాటలు వేశాయని గుర్తుచేశారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు అనేక తరాల విప్లవకారులు భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారని, వారి త్యాగాలు వృథా కాకుండా వారు కలలుగన్న సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు సంస్మరణ సభలను నిర్వహించి అమరవీరుల జీవితాలు, త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ప్రజలకు వివరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, పీవైఎల్ నాయకులు పోలేబోయిన కిరణ్, ఐఎఫ్‌టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోస్ మధు, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు, ఏఐకేఎంఎస్ నాయకులు దాసరి శీను తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA