Suryapet: పదేళ్లు పార్టీని మోసిన నేతకు అన్యాయమా?.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు!

Suryapet: పదేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించిన సీనియర్ బీసీ నేత చెవిటి వెంకన్న యాదవ్‌ను సూర్యాపేట కాంగ్రెస్‌లో పక్కనపెడుతుండటంపై కార్యకర్తలు భగ్గుమంటున్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Updated on: 5 Oct 2026 4:13 PM IST
Suryapet
X

Suryapet: పదేళ్లు పార్టీని మోసిన నేతకు అన్యాయమా?.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు!

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ బీసీ నాయకుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం, ముఖ్య నేతలు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారా అనే చర్చ ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని అత్యంత గడ్డు పరిస్థితుల్లోనూ దాదాపు పదేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ జెండాను భుజాన మోసి క్షేత్రస్థాయిలో కేడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక బలమైన బీసీ నాయకుడు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడం వెనుక ఆంతర్యమేంటని క్షేత్రస్థాయి కార్యకర్తలు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు.

ఆయనను ఉద్దేశపూర్వకంగా ఎవరు దూరం పెట్టారు? ఎందుకు దూరం పెట్టారు? ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకనే ఈ రాజకీయ కుట్రలు సాగుతున్నాయా అంటూ కేడర్ నిలదీస్తోంది.. అధికారాలు మారవచ్చు, పదవులు రావచ్చు పోవచ్చు.. కానీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నాయకులను, నమ్ముకున్న పాత కార్యకర్తలను విస్మరించడం ప్రజా ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో చెవిటి వెంకన్న యాదవ్ పోషించిన పాత్రను ఎవరూ కాదనలేరు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి పోరాటంలో ముందుండి లాఠీదెబ్బలు తిని, కేసులు ఎదుర్కొన్న నేతను ఇప్పుడు వేడుకలు, కీలక నిర్ణయాల నుంచి పక్కన పెట్టడంపై బీసీ సామాజిక వర్గాలు, కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది.

కలవాల్సింది నాయకులను కాదు.. కష్టపడ్డ కార్యకర్తలను – కేడర్ ఆవేదన:

వెంకన్న యాదవ్ దూరంపై పార్టీ శ్రేణులు పలు భావోద్వేగ అంశాలను ప్రస్తావిస్తున్నాయి. నాయకులను కలవడమే రాజకీయమా? ఒక బీసీ నేతగా తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరుపుకోవడం తప్పా అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధినాయకులను కలిసి మెలిగి ఉండటమే రాజకీయమా? కష్టాల్లో తోడున్న కార్యకర్తల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే అసలైన రాజకీయ బలం కాదా అని ప్రశ్నిస్తున్నారు.

పదేళ్ల త్యాగం మరువలేనిది. సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా పార్టీని సజీవంగా ఉంచిన నాయకత్వాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు అధికారం వచ్చాక కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.

బీసీ నాయకత్వానికి దక్కాల్సిన ప్రాధాన్యత. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయానికి కట్టుబడి, పార్టీ కోసం జీవితాన్ని ధారపోసిన పాతతరం నాయకులను, బీసీ గళాన్ని సముచిత రీతిలో గౌరవించకపోతే క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని చెవిటి వెంకన్న యాదవ్ లాంటి బలమైన బీసీ ప్రజా నాయకుడికి సరైన ప్రాధాన్యతనిచ్చి, సూర్యాపేట కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy