Suryapeta: కేసీఆర్ హయాంలో కరువు లేదు, ఇప్పుడు మళ్లీ నీళ్ల తిప్పలు!

Suryapeta: కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. విద్యుత్, నీళ్ల సమస్యలపై సూర్యాపేటలో తీవ్ర విమర్శలు!

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Oct 2026 3:28 PM IST
Suryapeta
X

Suryapeta: కేసీఆర్ హయాంలో కరువు లేదు, ఇప్పుడు మళ్లీ నీళ్ల తిప్పలు!

Suryapeta: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదని, ఏం చేయాలో దిక్కుతోచక చేతులెత్తేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం స్కాములు, వాటాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితి స్పష్టంగా కనబడుతోందని, తెలంగాణ నుంచి పారుతున్న నీళ్లతోనే ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందుతోందని అన్నారు. ఇప్పటివరకు కృష్ణాలో మనం 18 టీఎంసీల నీళ్లు కూడా వాడలేదని, కన్నెపల్లి పంపు హౌస్ ఆన్ చేస్తే ప్రతి చెరువు మత్తడి దునికేదని, తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉండేవని తెలిపారు. గోదావరి నుంచి 250 టీఎంసీలు ఎత్తుకునే వాళ్లమని, కేసీఆర్ హయాంలో తెలంగాణకు కరువు అనేదే లేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుత కరువుకు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను తట్టెడు మట్టి లేకుండానే ప్రారంభించవచ్చని అన్నారు.

ఎల్ నినో వస్తుందని ఏడాది ముందు నుంచే నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని, కేసీఆర్ హయాంలో రెప్పపాటు కరెంట్ పోని రాష్ట్రంగా రికార్డు సృష్టించామని, ప్రస్తుతం కరెంట్, నీళ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని విమర్శించారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, అధికారుల నిర్లక్ష్యం ఉంటే మెమోలు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులను బలి చేసే కుట్రలు చేస్తోందని, ప్రైవేట్ బొగ్గు కమిషన్లకు ఆశపడి సింగరేణిని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.

కరువుకు ఎల్ నినో కారణం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మీకు చేతకాకపోతే మాకు అప్పగించండి విద్యుత్, నీళ్లు ఎలా ఇవ్వాలో చూపిస్తామని సవాల్ విసిరారు. మన రాష్ట్ర వనరులను దోచి పరాయి రాష్ట్రాన్ని బాగు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, మళ్లీ కేసీఆర్ రాగానే అన్నింటిని ఎలా పునరావృతం చేయాలో తమకు తెలుసని జగదీష్ రెడ్డి అన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA