Gudipally: నిరుపేదలకు చేయూత పింఛన్లతో ఆర్థిక భరోసా: బాలునాయక్!

Gudipally: గుడిపల్లిలో 223, పీఏ పల్లిలో 433 మందికి కొత్త చేయూత పింఛన్ల పత్రాలను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ నవంబర్ 18న అందజేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 18 Nov 2026 4:04 PM IST
Gudipally
X

Gudipally: నిరుపేదలకు చేయూత పింఛన్లతో ఆర్థిక భరోసా: బాలునాయక్!

గుడిపల్లి / పీఏ పల్లి: నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు అన్నారు.

గుడిపల్లి మండలంలో 223 మంది, పీఏ పల్లి మండలంలో 433 మంది లబ్ధిదారులకు మంజూరైన కొత్త చేయూత పింఛన్ల పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా అందించే పింఛన్ సొమ్ము పేదలకు నిత్యావసరాలు, వైద్య ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆత్మగౌరవంతో జీవించేందుకు అండగా నిలుస్తుందని తెలిపారు.

మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత

మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ వంటి పథకాలతో ప్రభుత్వం పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే వివరించారు.

దేవరకొండకు ఆర్డీఓ కార్యాలయం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

గతంలో ఆర్డీఓ కార్యాలయం మిర్యాలగూడలో ఉండేదని, తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దేవరకొండకు ఆర్డీఓ కార్యాలయాన్ని తీసుకొచ్చానని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గుడిపల్లి, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము మండలాల్లో సుమారు రూ.15 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయ సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

కొండమల్లేపల్లిలోనే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యాలయం

గతంలో కొత్త వాహనం కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ కోసం మిర్యాలగూడకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రజల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు కొండమల్లేపల్లి మండల కేంద్రంలోనే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. దీంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలునాయక్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాల్లో అధికారులు, మండల అధ్యక్షులు నెర్మటి సతీష్ రెడ్డి, మావిల్ల లక్ష్మి నారాయణ, ఏవి రెడ్డి, ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్, వంగాల ప్రతాపరెడ్డి, వీరబోయిన ఎల్లయ్య యాదవ్, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మద్దిమడుగు రామస్వామి, తేరా సత్యం రెడ్డి, మండలాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA